జూబ్లీహిల్స్ ఎన్నికతో ఒరిగేదేం లేదు
షాద్‌నగర్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏపార్టీ గెలిచినా ప్రజలకు ఒరిగేదేం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన జాగృతి జనం బాట కార్యక్రమాన్ని వెళ్తున్న ఆమెకు షాద్‌నగర్ బైపాస్‌లో జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు మాయమాటలు చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గ్రామ స్థాయిలో జనం ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకే జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాఫా, నియోజకవర్గ ఇన్‌చార్జి చీమల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


