ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి
శంకర్‌పల్లి: దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ అధికారి జేఎం లింగ్డో అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని మోకిల గ్రామంలో పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, గ్రామస్తులకు సిబ్బంది కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణ ద్వారా ఎరువు తయారీ గురించి తెలుసుకొని అధికారులను అభినందించారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం, పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రోజురోజుకూ పెనుభూతంలా వ్యాపిస్తోందని, దీంతో పర్యావరణం విషతుల్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ నిషేధంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చక్కగా ఉందని, ఇదే స్ఫూర్తిని మిగతా గ్రామాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకయ్య, ఎంపీఓ గిరి రాజు, ఏపీఓ నాగభూషణం, పంచాయతీ సెక్రెటరీ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం మాజీ అధికారి లింగ్డో


