తీరుమార్చుకోండి
అధికారులపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆగ్రహం
షాబాద్: నెలరోజులుగా రిజిస్టర్‌లో సంతకాలు లేకపోవడం ఏమిటి.. అసలు అధికారులు వస్తున్నారా లేదా అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం మధ్యాహ్నం గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్‌రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. వారు వెళ్లిన సమయంలో తహసీల్దార్ అన్వర్, డిప్యూటీ తహసీల్దార్ మధు లేకపోవడంతో అక్కడే ఉన్న జూనియర్ అసిస్టెంట్‌ను ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లారు.. రోజూ ఇలాగే ఉంటుందా అని ప్రశ్నిస్తూ హాజరు రిజిస్టర్ తెప్పించి పరిశీలించారు. నెలరోజులుగా సంతకాలు లేవని, ఉద్యోగం అంటే అలుసుగా ఉందా అంటూ మండిపడ్డారు. సంతకాలు లేని చోట ఆబ్‌సెంట్ అని రాశారు. పది నిమిషాల తరువాత డిప్యూటీ తహసీల్దార్ రావటంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పనిచేస్తే ప్రజలకు మీపై ఎలా నమ్మకం ఉంటుందని నిలదీశారు. తీరు మార్చుకోవాలని, సమయపాలన పాటించాలని హితవు పలికారు. వెంటనే ఆర్డీఓ చంద్రకళకు ఫోన్ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.


