‘పటేల్’ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం
ఇబ్రహీంపట్నం రూరల్: సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా యువజన అధికారి ఐసయ్య అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అందరి భాగస్వామ్యంతో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఐక్యత పాదయాత్ర ఉంటుందని తెలిపారు. ప్రతి పాదయాత్ర 8 నుంచి 10 కిలోమీటర్లు సాగేలా ప్రణాళిక రూపొందించి అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 మధ్య నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో రెండు విడుతల్లో పాదయాత్రలు ఉంటాయన్నారు. కలెక్టర్, అధికారులు, క్రీడకారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, పౌరులు పాల్గొంటారని తెలిపారు. నవంబర్ 2 వరకు జాతీయ స్థాయిలో వ్యాసరచన, లఘుచిత్ర పోటీలు, క్విజ్ పోటీలు వెబ్‌సైట్ ద్వారా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 1 అక్టోబర్ 2025 నాటికి 15 ఏళ్లు పైబడి 29 సంవత్సరాల లోపు వయస్సు గల యువతీయువకులు అర్హులని చెప్పారు. నవంబర్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసి, 21 నుంచి 24 వరకు అధికారికంగా ప్రకటిస్తారన్నారు. 26న జాతీయ స్థాయి విజేతలను ప్రకటిస్తారని వెల్లడించారు. పోటీల ద్వారా జాతీయ స్థాయిలో ఎంపికై న 150 మందికి కేంద్ర యువజన వ్యవహరాలు, క్రీడామంత్రితో కలిసి జాతీయ ఐక్యత పాదయాత్రలో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి వెంకటేశం, జిల్లాస్థాయి కమిటీ సభ్యులు మణిభూషణ్, ఎల్లారెడ్డి, నరేష్, అవినాష్‌రెడ్డి, ఆర్‌కేపురం సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి


