లక్కీ చాన్స్
మద్యం దుకాణాలకు డ్రా
● అదృష్టాన్ని పరీక్షించుకున్న వ్యాపారులు
● వరించిన వారి ముఖాల్లో సంతోషం
● దక్కని వాళ్లు నిరాశతో వెనక్కి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మద్యం షాపులకు లక్కీ డ్రా కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. షాపులు దక్కించుకున్న అదృష్టవంతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరియగా.. దక్కని వారు ఒకింత నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సరూర్‌నగర్, శంషాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్ ఎకై ్సజ్ డివిజన్ల పరిధిలో మొత్తం 693 మద్యం షాపులకు టెండర్లు పిలవగా.. 36,266 దరఖాస్తులు అందాయి. ఆయా షాపులకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించారు. సరూర్‌నగర్ డివిజన్‌లోని 138 మద్యం షాపులకు శంషాబాద్ మల్లిక కన్వెన్షన్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి పాల్గొనగా, శంషాబాద్ డివిజన్ పరిధిలోని 111 షాపులకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సమక్షంలో డ్రా నిర్వహించారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 97 షాపులకు బంజారాహిల్స్‌లోని బీజేఆర్ భవన్‌లో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 82 షాపులకు అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి డ్రా నిర్వహించారు.
షాపులు దక్కించుకున్న మహిళలు
ఇక మేడ్చల్ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఆయా డివిజన్ల పరిధిలోని మద్యం షాపులకు నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. మద్యం షాపులకు నిర్వహించిన ఈ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.1,087.98 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఎకై ్సజ్‌శాఖ అధికారులు ప్రకటించారు. షాపులు దక్కించుకున్న వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు చెల్లించి షాపులను సొంతం చేసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. డిప్యూటీ కమిషనర్లు అనిల్ కుమార్‌రెడ్డి, పి.దశరథ్, డిప్యూటీ సూపరింటెండెంట్‌లు నవీన్, కృష్ణప్రియ, ఉజ్వలారెడ్డి, పంచాక్షరి, ఏఈఎస్‌లు శ్రీనివాసరావు, స్మితా సౌజన్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ధూల్‌పేటలోని షాపు నంబర్ 72, 75లు భార్యాభర్తలిద్దరూ చెరొకటి చొప్పున దక్కించుకోవడం గమనార్హం. సరూర్‌నగర్‌కు చెందిన ఓ మద్యం వ్యాపారి 32 షాపులకు టెండరు వేయగా, ఒక్కటి మాత్రమే దక్కడం విశేషం. మద్యం షాపులు దక్కించుకున్న వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే 36,266 మందిలో 693 మందే అదృష్టవంతులుగా నిలిచారు.
మొత్తం మద్యం షాపులు 693
అందిన దరఖాస్తులు 36,266
అదృష్టం వరించిన వారు 693
సమకూరిన ఆదాయం(రూ. కోట్లలో) 1,087.98
లక్కీ చాన్స్


