పెన్షనరీ డబ్బులు చెల్లించండి
ఇబ్రహీంపట్నం రూరల్: రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షనరీ డబ్బులు వెంటనే చెల్లించాలని పెన్షనర్ల అసోసియేషన్ (ఎస్‌జీపీఏటీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉ.నరేందర్‌రెడ్డి, సలహాదారు మల్లయ్య డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు సుమారు 9వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారని తెలిపారు. ఒక్కో పెన్షనర్‌కు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బకాయి చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఎంతో మంది ఇబ్బందులతో అప్పుల పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జీవో విడుదల చేసినా విధివిధానాలు రూపొందించలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎస్‌జీపీఏటీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపీకృష్ణ, కోశాధికారి తుమ్మల రాంరెడ్డి, కార్యవర్గ సభ్యులు మోహన్‌రెడ్డి, జనార్దన్ రెడ్డి, అనంతరెడ్డి, సత్యనారాయణరెడ్డి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ఆందోళన


