ఆర్టీసీ ప్రయాణం సురక్షితం
షాద్‌నగర్‌రూరల్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎంతో సురక్షితమని అగ్నిమాపక కేంద్రం అధికారి జగన్ అన్నారు. పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో సోమవారం డీఎం ఉష ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు, బస్సుల్లో అగ్నిప్రమాదాలపై ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది, ప్రయాణికులకు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రతి బస్సులో అగ్నిప్రమాదాలను నివారించే సిలిండర్లు ఉంటాయని తెలిపారు. ప్రమాదాలు జరిగిన సమయంలో బయటకు వెళ్లేందుకు అత్యవసర ద్వారం ఉంటుందని, దాని ద్వారా బయటి వ్యక్తులు లోపలికి వెళ్లి ప్రయాణికులను రక్షించొచ్చని, ప్రమాదంలో ఉన్న ప్రయాణికులు బయటకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు మన చేతుల్లో ఉన్న వస్తువులతో అద్దాలను పగులగొట్టి బయటకు వెళ్లొచ్చని తెలిపారు. ప్రైవేట్ బస్సుల్లో ఇలాంటి అవకాశం ఉండదని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ నాగులు, అసిస్టెంట్ మేనేజర్ సుధాకర్, సేఫ్టీ వార్డెన్ వెంకటయ్య, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ అర్జున్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


