పెద్ద చెరువు సుందరీకరణ
ఇబ్రహీంపట్నం: పెద్ద చెరువు కట్టను రూ.18 కోట్లతో సుందరీకరించనున్నట్టు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్, హెచ్‌ఆర్‌డీసీఎల్, పంచాయతీరాజ్, మన్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం చెరువు కట్టను సోమవారం పరిశీలించారు. సుందరీకరణ కోసం చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని.. అందులో భాగంగా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చబోతున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్టను సుందరీకరించి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ పనులు చేపట్టేందుకు అవసరమైన రూ.18 కోట్ల నిధులను హెచ్‌ఎండీఏ మంజూరు చేసినట్లు చెప్పారు. చెరువు కట్టకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కట్టపై ఉన్న రక్తమైసమ్మ, కట్ట మైసమ్మ దేవాలయాలు, చిన్న, పెద్ద తూములు, చిన్న చెరువును అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్‌ఈ రవిశంకర్, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్, హెచ్‌ఎండీఏ ఈఈ రజిత, హెచ్‌ఆర్‌డీసీఎల్ ఈఈ మహబూబ్ మియా, పంచాయతీరాజ్ ఈఈ సుందర్శన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ సునీతారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


