కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి
సీఐటీయూ నాయకుల డిమాండ్
ఇబ్రహీంపట్నం: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం శేరిగూడలోని ఇందు కళాశాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ ఎల్లేష్ మాట్లాడుతూ.. సెంట్రింగ్ పనులు చేస్తూ భవనంపై నుంచి పడి ఒరిస్సా కార్మికుడు దివాకర్ బత్ర మృతి చెందాడని తెలిపారు. దీనిని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచి, మృతదేహాన్ని ఆ రాష్ట్రానికి తరలించేందుకు యత్నించిందని ఆరోపించారు. పోలీసులు స్పందించి మృతదేహాన్ని తిరిగి రప్పించి పోస్టుమార్టం చేయించి, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలా మోసం చేసిన యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతిలేకుండా చేపట్టిన నిర్మాణ పనులను ఆపాలన్నారు. అదే విధంగా మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వలస కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన కారులకు పోలీసులు నచ్చజెప్పే యత్నం చేశారు. ససేమిరా అనడంతో అరెస్టు చేసి వదిలిపెట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు యాదగిరి, మల్లికార్జున్, రాజు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.


