బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
వెంగళరావునగర్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేపై మధురానగర్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈనెల 26న లక్ష్మీనరసింహనగర్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు తమ ప్రచార వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపిరు. ఇదే సమయంలో పాదయాత్ర చేస్తున్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అక్కడికి వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రచార వాహనం డ్రైవర్ రమేష్‌ను హెచ్చరిస్తూ, సంజ్ఞలు చేస్తూ వెళ్లాడు. ఈ సంఘటన వీడియో తీసిన కాంగ్రెస్ నేతలు మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ వీడియోను పోలీసులకు అందజేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో పాటు, బీఆర్‌ఎస్ నేతలు భాస్కర్, ఫయీమ్, నాగరాజు, స్క్రాబ్ రవి, సంతోష్ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రియాజ్ కుటుంబ సభ్యులను వేధించొద్దు
పోలీసులకు హెచ్‌ఆర్‌సీ ఆదేశం
సిటీ కోర్టులు: పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన రియాజ్ కుటుంబ సభ్యులను వేధించొద్దని పోలీసులను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. రియాజ్, ప్రమోద్‌కుమార్ మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబందించి వివరణాత్మక నివేదిక సమర్పించాలని డీజీపీకి స్పష్టం చేసింది. రియాజ్ తల్లి, భార్య, పిల్లలు సోమవారం హెచ్‌ఆర్‌సీ ఎదుట హాజరై పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. తమను ఇంట్లోకి అనుమతించడం లేదని, తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. రియాజ్‌ను ప్రమోద్ రూ.3 లక్షలు డిమాండ్ చేశారని, రూ.30 వేలు చెల్లించగా.. మిగతా మొత్తం ఇవ్వాలని వేధించారన్నారు. ఎన్‌కౌంటర్ ఘటనపై విచారణ చేస్తున్న కమిషన్ వచ్చే నెల 24న నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తాజా ఫిర్యాదుతో తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది. ఆలోగా వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రియాజ్ కుటుంబ సభ్యులపై ఎటువంటి బలవంతపు చర్యలు, వేధింపులు చేపట్టవద్దని స్పష్టం చేసింది.
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
చందానగర్: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఒకరు, మానసిక సమస్యలతో బాధపడుతూ మరొకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆంజనేయులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చందానగర్ హుడా కాలనీకి చెందిన కాశీ రెడ్డి పురుషోత్తం రెడ్డి (48) ఏడేళ్ల క్రితం కేరళకు చెందిన జైకుమార్ సంతమ్మ రాజన్ బాబుకు రూ.13 లక్షలు అప్పుగా ఇచ్చాడు. పలు మార్లు అడిగినా అతను డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి లోనైన పురుషోత్తం రెడ్డి ఈ నెల 27న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
భవనం 14వ అంతస్తు నుంచి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆంజనేయులు కథనం మేరకు.. సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు (46) నల్లగండ్లలోని రాంకీ వన్ గెలాక్సీలో భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను భవనం 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు అతడిని సమీపంలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.


