కనక వర్షం కురుస్తుందని..
దుండిగల్: పూజలు చేస్తే రెట్టింపు ఆదాయం వస్తుందని, కనక వర్షం కురుస్తుందని నమ్మించి మోసం చేసిన ముఠా సభ్యులను దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం దుండిగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన బస్వరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పశువుల దాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అతడికి ఫిలింనగర్‌కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ గుగులోత్ రవీందర్, కొరియర్ బాయ్‌గా పని చేస్తున్న సూరారం ప్రాంతవాసి కవిర సాయి బాబాతో పరిచయం ఏర్పడింది. కాగా బస్వరాజు వద్ద పెద్దమొత్తంలో డబ్బు ఉందన్న విషయాన్ని గుర్తించిన వారు డబ్బు కాజేయాలని పథకం రచించారు.
బారీష్ పూజ పేరుతో స్కెచ్..
తమకు తెలిసిన గురూజీ ఉన్నాడని, అతనితో బారీష్ పూజ చేయించుకుంటే కనక వర్షం కురుస్తుందని నమ్మించారు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ ఖయ్యూంను గురూజీగా నమ్మించి బస్వరాజుకు పరిచయం చేశారు. బహదూరపూరకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, ఖైరతాబాద్‌కు చెందిన ఠాకూర్ మనోహర్ సింగ్‌లను అతడి అనుచరులుగా రంగంలోకి దింపారు. బస్వరాజును పూర్తిగా నమ్మించిన రవీందర్, సాయిబాబా ఈ నెల 18న ముఠా సభ్యులతో కలిసి గండిమైసమ్మలోని అతని ఇంటికి వచ్చారు. పూజ చేస్తున్నట్లు నటించి పూజలో రూ.25 లక్షలు పెట్టించారు. పూజ పూర్తయిన అనంతరం ప్రసాదంలో మత్తు మందు కలిపి అతడి ఇచ్చారు. బస్వరాజు సృహ కోల్పోవడంతో ముఠా సభ్యులు డబ్బుతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు ఇర్ఫాన్, రవీందర్, సాయిబాబా, మనోహర్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.8.5 లక్షల నగదు, ఎయిర్ గన్, కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ ఖయ్యూం పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇర్ఫాన్, ఖయ్యూంలపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయన్నారు. అధిక డబ్బులకు ఆశ పడి నకిలీ బాబాలను ఆశ్రయించి మోసపోవద్దని డీసీపీ సూచించారు. సమావేశంలో ఏసీపీ శంకర్‌రెడ్డి, సీసీఎస్ ఏసీపీ నాగేశ్వర రావు, దుండిగల్ సీఐ సతీష్, డీఐ బాల్‌రెడ్డి, మేడ్చల్ డీఐ కిరణ్ తదితరులు ఉన్నారు.
రూ.25 లక్షలు దోపిడీ
బాబా అవతారంలో టోకరా
నలుగురు నిందితుల అరెస్ట్
పరారీలో ప్రధాన నిందితుడు


