ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ‘సత్తు’
యాచారం: రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సత్తు పాండురంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిధి కుర్మిద్ద ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో కార్యదర్శిగా నియమించినందుకు సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
శంకర్‌పల్లి: కూలీ పనుల కోసం వెళ్లి, ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. శంకర్‌పల్లి ఎస్‌ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన విఠల్(35), సునీతలు దంపతులు. వీరికి కొడుకు, కుమార్తె ఉన్నారు. బతుకుదెరువు కోసం మండల పరిధి మహాలింగాపురం గ్రామంలో నివాసం ఉంటూ.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజు మాదిరిగానే ఆదివారం కూలీ పనులకు వెళ్లిన విఠల్.. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ తెలియరాలేదు. సోమవారం విఠల్ భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
యువతి ఆత్మహత్య
మంచాల: యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధి ఆరుట్ల గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పంబాల నందిని(21), ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం విధులకు వెళ్లలేదు. తండ్రి దుర్గేష్, తల్లి సంతోష కూలి పనికి వెళ్లగా.. ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం పని ముగించుకొని తండ్రి ఇంటికి వచ్చి చూడగా.. కూతురు విగత జీవిగా వేళాడుతూ కనిపించింది. ఆమె ఆత్మ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


