భవనం పైనుంచి పడి కార్మికుడి మృతి
● గుట్టుచప్పుడు కాకుండా
మృతదేహం తరలింపు
● అడ్డుకొని కేసు నమోదు చేసిన పోలీసులు
ఇబ్రహీంపట్నం: నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ప్రమాదవశాత్తు ఓ వలస కార్మికుడు కింద పడి మృతి చెందాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో కేసు నమోదు చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి, సీఐటీయూ యూనియన్ నాయకుడు ఎల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశాలోని నబ్బరంగాపూర్ జిల్లా దమ్మన్నగూడ గ్రామానికి చెందిన దివాకర్ బత్ర(26) రెండు నెలలుగా శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజ్‌లో నిర్మాణంలో ఉన్న భవనానికి సెంట్రింగ్ పని చేస్తున్నాడు. శనివారం అతడు ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పొయాడు. పోస్టుమార్టం చేయకుండా, ఆ కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఆ కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని ఒడిశాకు తరలిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో శవాన్ని ఇబ్రహీంపట్నంకు రప్పించి కేసు నమోదు చేసి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.
రూ.20 లక్షలు ఇవ్వాలి
మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ మున్సిపల్ కార్యదర్శి ఎల్లేశ్ డిమాండ్ చేశారు. కార్మికుడి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు యత్నించిన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


