ఐసీడీ గోదాములో భారీ అగ్ని ప్రమాదం
మూసాపేట: మూసాపేట గూడ్స్‌షెడ్ రోడ్డులోని కంటైనర్ కార్పొరేషన్ డిపోలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. డిజాస్టర్ ఫోర్స్, ఐసీడీ అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులో ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపో కొనసాగుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతయ్యే దినుసులు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలు, గృహోపకరణాలు, యూరియా, గోధుమలు తదితరాలను గోదాముల్లో భద్రపరచి కస్టమ్స్ క్లియరైన తర్వాత ఆయా వ్యాపారస్తులు వచ్చి తీసుకెళతారు. ఈ నేపథ్యంలో కస్టమ్స్ క్లియర్ కాని విదేశీ మద్యం బాటిళ్లు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలను గోదాములో నిల్వ చేశారు. శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి గోదాములోని విలువైన వస్తువులు ఆహుతయ్యాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో రాత్రి సిబ్బంది సెక్యూరిటీ ఉన్నతాధికారులతో పాటు ఫైర్ స్టేషన్‌కు, పోలీసులకు, డీఆర్‌యఫ్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గత కొన్నేళ్లుగా కస్టమ్స్ క్లియర్ కాని, కాలం చెల్లిన మొబైల్స్ బ్యాటరీలు పేలి మంటలు చెలరేగినట్లు సమాచారం. కూకట్‌పల్లి, సనత్‌నగర్, జీడిమెట్ల, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ ఫైర్ స్టేషన్‌ల నుంచి 8 అగ్నిమాపక శకటాల ద్వారా 40 మంది సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.


