రుధిర దారులు
తొమ్మిది నెలల్లో రోడ్డు ప్రమాదాల వివరాలు
నిర్లక్ష్యంతో ప్రమాదాలు
యాచారం: జిల్లాలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఓ చోట జరుగుతున్న యాక్సిడెంట్లతో ప్రయాణికులు, వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అజాగ్రత్త, అతివేగం, నిద్ర, మద్యం మత్తు, ఓవర్ లోడ్ వీటికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా శుభకార్యాలు, పర్యాటక ప్రాంతాలు, స్వగ్రామాలకు వెళ్తున్న వారు ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంభయంగా ప్రయాణం సాగిస్తున్నారు. ప్రమాదాల బారిన పడిన వారిలో కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు క్షతగాత్రులుగా మిగిలి, బతకలేక, చావలేక అన్నట్లు దుర్భర జీవితాలు గడుపుతున్నారు.
తనిఖీలు చేపడుతున్నా..
రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు గతంలో ఎన్నడు లేని విధంగా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం ఉదయం, సాయంత్రం వేళ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీఐల పర్యవేక్షణలో డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్‌సీలు, వాహనాల నంబరు ప్లేట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ ఓవర్‌లోడ్ తదితర అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. పలు సందర్భాల్లో సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు, జరిమానా విధిస్తున్నారు. దీంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా పూర్తిస్థాయిలో బ్రేక్ పడటం లేదు. దీంతో ఇంటింటికీ తిరిగి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే దిశగా పోలీసులు ఆలోచన చేస్తున్నారు.
తొమ్మిది నెలల్లో 68 మంది మృతి
ఇబ్రహీంపట్నం డివిజన్‌లో గత తొమ్మిది నెలలుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 68 మంది మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి. డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఆదిబట్ల, మాడ్గుల, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌ల పరిధిలో జరిగిన ప్రమాదాలకు సంబంధించి 206 కేసులు నమోదయ్యాయి. ఇందులో 68 మంది మృతి చెందగా, 138 మంది క్షతగాత్రులుగా మారి కాళ్లు, చేతులు కోల్పోయారు. కుటుంబాన్ని పోషించే వీరు వైకల్యంతో దిక్కుతోచని స్థితికి చేరుతున్నారు. ఫలితంగా బాధిత ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం డివిజన్(ఏసీపీ) పరిధి నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై దాదాపు 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సాగర్ హైవే ఇబ్రహీంపట్నం మండల కేంద్రం సమీపంలో ఖానాపూర్ గేట్ నుంచి మాల్ వరకు సింగల్ రోడ్డే ఉండడంతో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రాణాలు హరిస్తున్న రోడ్డు ప్రమాదాలు
నిత్యకృత్యంగా మారిన వైనం
అతివేగం, అజాగ్రత్త, మద్యం, నిద్ర మత్తు, ఓవర్ లోడింగే ప్రధాన కారణం
పోలీసులు తనిఖీలు చేస్తున్నా
పూర్తి స్థాయిలో మారని పరిస్థితి
పీఎస్ కేసులు మృతులు క్షతగాత్రులు
ఇబ్రహీంపట్నం 59 14 45
మంచాల 23 4 19
యాచారం 40 15 25
ఆదిబట్ల 63 28 35
మాడ్గుల 11 5 6
గ్రీన్ ఫార్మాసిటీ 10 2 8
వ్యక్తిగత నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు డ్రైవింగ్ చేసే వారు జాగ్రత్తగా నడపాలి. అతి వేగం, పరిమితికి మించి ప్రయాణికులకు ఎక్కించుకోవడంతో వాహనాలు అదుపు తప్పుతున్నాయి. బైక్ నడిపేవారు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలి. ప్రజల్లో మార్పు కోసం విసృత్తంగా తనిఖీలు చేపట్టి అవగాహన కల్పిస్తున్నాం. నింబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం.
– కేపీవీ రాజు, ఏసీపీ, ఇబ్రహీంపట్నం
రుధిర దారులు


