దుకాణ కేటాయింపులకు దరఖాస్తుల ఆహ్వానం
తుక్కుగూడ: ఖాళీగా ఉన్న దుకాణా సముదాయాలను అద్దెకు ఇవ్వడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మహేశ్వరం 01, యాచారం 05, శంషాబాద్ 05, సాహెబ్‌నగర్ 03 ప్రభుత్వం నిర్మించిన దుకాణ సముదాయలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని షెడ్యూల్ కులాల వారికి నెలవారీ అద్దెకివ్వనున్నట్టు చెప్పారు. స్థానికతతో పాటు 18 నుంచి 35 ఏళ్ల వయస్సు లోపు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు వచ్చేనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చేవెళ్ల: వైద్యవృత్తి ఎంతో పవిత్రమైందని మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి జనరల్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో శనివారం ‘అధ్యాయ 2025’ పేరుతో కళాశాల ఫెస్ట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి వైద్యులుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించే వైద్యులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. అనంతరం క్రీడల్లో, విద్యలో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జోయారాణి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్‌రావు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.
నందిగామ: మండల పరిధిలోని కన్హా శాంతి వనంలో బీజేపీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం వచ్చారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొని కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దత్తాత్రేయను విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, నర్సింహయాదవ్, మోహన్ సింగ్, సుధాకర్ అప్ప, బల్‌వంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాజు, బోయ అశోక్, అనిల్ కుమార్ గౌడ్, రాజు నాయక్, కుమ్మరి మహేశ్, ప్రతాప్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవాబుపేట: అనారోగ్యంతో ఓ యువ సైనికుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వట్టిమీనపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోముల వెంకట్‌రాంరెడ్డి(30) ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. రెండేళ్ల క్రితం మనీషాను వివాహం చేసుకొని ఢిల్లీలో ఉంటున్నాడు. ఉన్నట్లుండి అనారోగ్యానికి గురికావడంతో ఆర్మీ ఆస్పత్రిలో చేరాడు. అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని శనివారం నగరంలోని శంషాబాద్‌లో కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం గ్రామానికి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య గ్రామానికి చేరుకొని పాడె మోసారు. మృతుడికి తండ్రి మోహన్‌రెడ్డి, తల్లి సావిత్రమ్మ, భార్య మనీషా, సోదరుడు శశివర్ధన్‌రెడ్డి ఉన్నారు.
దుకాణ కేటాయింపులకు దరఖాస్తుల ఆహ్వానం
దుకాణ కేటాయింపులకు దరఖాస్తుల ఆహ్వానం


