వేగంతో ఆగమే!
● నియంత్రణ కొరవడిన వాహన చోదకులు
● లోపించిన స్పీడ్ గవర్నర్ డివైజ్‌లు
● హైవేలపై దూసుకెళ్తున్న వాహనాలు
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ రహదారులపై బస్సులు, లారీలు, కార్లు వంటి వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. నిర్దేశిత వేగానికి మించి వెళ్తున్నాయి. ప్రయాణికులను సాధ్యమైనంత త్వరగా గమ్యస్థానానికి చేర్చాలనే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పోటీపడుతున్నాయి. దీంతో డ్రైవ ర్లు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోవడంలేదు. రాత్రి వేళ, వర్షం కురుస్తున్న సమయంలో అతివేగంతో వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు జరిమానాలు విధిస్తున్నా.. ఏమాత్రం చలనం లేనట్టుగా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. వాహన వేగంపై నియంత్రణ లేక ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి.
స్పీడ్ గవర్నర్ డివైజ్‌లు ఎక్కడ?
రవాణా, ప్రయాణికుల వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గవర్నర్ డివైజ్‌లను ఉపయోగి స్తుంటారు. మన రాష్ట్రంలో వీటి వినియోగం లేదు. మహారాష్ట్ర, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సుల స్పీడ్‌కు కళ్లెం వేసేందుకు స్పీడ్ గవర్నర్ డివైజ్‌లను ఉపయోగిస్తున్నారు. మన దగ్గర కూడా ఉమ్మడి రాష్ట్రంలో బస్సులు తయారు చేసే కొన్ని సంస్థలు స్పీడ్ కంట్రోల్ డివైజ్లను అమర్చేవి. కొన్నేళ్ల పాటు ఇది కొనసాగినా తర్వాత పూర్తిగా వదిలేశారు. దీంతో రాష్ట్రంలో వాహన వేగంపై నియంత్రణ లేకుండా పోయింది. ఏపీలోని కర్నూలులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం నేపథ్యంలో తెలంగాణలోనూ స్పీడ్ గవర్నర్ డివైజ్‌ల వినియోగంపై పునరాలోచించాల్సిన ఆవశ్యకత ఉందని వాహన రంగ నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కడ.. ఎంత వేగమంటే..
తెలంగాణలో బస్సులు ఎక్స్‌ప్రెస్ వేలపై గంటకు 100 కిలోమీటర్లు, నాలుగు లైన్ల జాతీయ రహదారులపై గంటకు 90 కిలో మీటర్లు, మున్సిపల్ పరిధిలోకి వచ్చే రోడ్లపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. ట్రావెల్స్ డ్రైవర్లు ఎక్కడా నిర్దేశిత వేగం నిబంధనలను పాటించడం లేదు. రాత్రి వేళ హైవేలపై అతివేగంగా వాహనాలను నడిపి ప్రయాణికులు, తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అతివేగంతో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని భావించినప్పుడు డయల్ 100కు లేదా సదరు ట్రావెల్స్ హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అత్యవసర కిట్లు తప్పనిసరి
బస్సు ఆపరేటర్లు తరచూ వాహన ఫిట్‌నెస్‌ను చెక్ చేయాలి. ప్రయాణికుల కోసం ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపేలా సూచిక బోర్డులు పెట్టాలి. ప్రమాదాలు జరిగితే వాటిని బద్ధలు కొట్టేందుకు సుత్తి అందుబాటులో ఉంచాలి. ఫస్ట్ ఎయిడ్ చేసే సదుపాయం ఉండాలి. ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణికులను అప్రమత్తం చేసే ఎమర్జెన్సీ అలారం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఓవర్ లోడ్‌తో బస్సులు నడపొద్దు. 10–12 గంటలపాటు ఏకధాటిగా ఏసీ బస్సులను నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. కంప్రెషర్, కూలింగ్ ఫ్యాన్లు, ఆల్టర్నేటర్ వంటి భాగాలు ఓవర్ లోడ్‌తో విద్యుత్ కనెక్షన్లు బలహీనపడతాయి. దీంతో మంటలు వ్యాపి స్తుంటాయి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు భద్రత విషయంలో రాజీ పడొద్దని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు.


