ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు
షాద్‌నగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమై ప్రయాణికులు సజీవ దహనమైన నేపథ్యంలో ఆర్‌టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు శనివారం తెల్లవారు జాము నుంచి షాద్‌నగర్ శివారులోని 44వ జాతీయ రహదారిపై రాయికల్ టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సులను షాద్‌నగర్ అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఫరహాన్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. రవాణా అనుమతి పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫైర్ సేఫ్టీ, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సీటింగ్, ప్రథమ చికిత్స కిట్స్, అత్యవసర ద్వారాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు.


