నిబంధనలు పాటించకుంటే చర్యలు
షాద్‌నగర్‌రూరల్: ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అన్వేష్ హెచ్చరించారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉప డైరెక్టర్ అంజుమ్ ఆబిదా ఆదేశానుసారం బుధవారం పట్టణంలోని మెడికల్ షాపుల్లో డ్రగ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్సు, ఫార్మసిస్ట్ హాజరు, నిల్వ ఉంచిన మందుల గడువు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెడికల్ షాపు నడిపేవారు తప్పకుండా లైసెన్సు తీసుకోవాలని అన్నారు. గడువు తీరిన మందులు విక్రయించరాదని, నిల్వ ఉంచిన మందుల గడవును ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. తప్పనిసరి ఫార్మసిస్టు అర్హత కలిగి ఉండాలని, వైద్యులు రాసిన మందు చీటీ ఉంటేనే మందులు ఇవ్వాలని సూచించారు. ప్రజలు అనుమతులు కలిగిన మెడికల్ షాపులలోనే మందులను తీసుకోవాలని అన్నారు. తనిఖీల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు రఫీ, నాగరాజు, విశ్వనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


