అక్రమ నిల్వలు, అనధికారిక అమ్మకాలు
మెడికల్ దుకాణాల మాయాజాలం!
సాక్షి, సిటీ బ్యూరో: అక్రమ సంపాదనే వారి ధ్యేయం. అందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం వారి వ్యాపారంగా మారుతోంది. అధికారులు తనిఖీల్లో మెడికల్‌షాపుల యాజమాన్యాల నిర్వాకం బయటపడుతోంది. దీంతో నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం, సీజ్ చేయడం అధికారుల వంతవుతోంది. ఇటీవలి కాలంలో సుమారు 350 మెడికల్ దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. మరో 4 దుకాణాలను సీజ్ చేశారు. మిగతా వాటిపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా మెడికల్ దుకాణాల్లో అక్రమ అమ్మకాలు మాత్రం ఆగడంలేదు. దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
● రాష్త్రంలో సుమారు 35 వేల వరకు మెడికల్ షాపులు ఉండగా అందులో ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 16 వేలకుపైగా మెడికల్ షాప్‌లు ఉన్నాయి. వీటిని తనిఖీ చేసేందుకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీలో సిబ్బంది తక్కువగా ఉండటంతో దుకాణ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుని నిబంధనలకు పక్కన పెట్టి మందుల అక్రమ అమ్మకాలకు తెరతీస్తున్నారు. అబార్షన్ కిట్లు, ఇతర కొన్ని రకాలు బహిరంగంగా అమ్మకంపై ఆంక్షలు ఉన్నాయి. అయినా చాలా దుకాణాల్లో ఇవి విరివిగా లభిస్తున్నాయి. స్టెరాయిడ్స్, మత్తు, కొన్ని రకాల మందులు ప్రత్యేక నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయినా మందుల దుకాణ నిర్వాహకులు యథేచ్చగా వాటి అమ్మకాలు సాగిస్తున్నారు. ఎలా ఉపయోగించాలనే సమాచారాన్ని సోషల్ మీడియాలో వీడియోలు చూసి పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో మార్కెట్‌లో గుర్తింపు ఉన్న కంపెనీల పేర్లతో నకిలీ మందులను మార్కెట్‌లో చెలామణి చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మెడికల్ ఏజెన్సీలపై కేసులు, అరెస్టులు జరిగాయి. నిత్యం తనిఖీలు, నోటీసులు, కేసులు, శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మెడికల్ దుకాణ యాజమాన్యాల్లో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. మరికొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే మెడికల్ దుకాణాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెల రోజుల వ్యవధిలోనే కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న వందకుపైగా మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మెడికల్ షాపుల నిర్వహణ, అనధికారికంగా నిల్వ చేయడం, విక్రయాలను గుర్తించి నాలుగు దుకాణాలను సీజ్ చేశారు. అక్రమంగా మందులు విక్రయిస్తున్నారన్న సమాచారంతో మరో మారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 800 మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. 235 ఔషధ దుకాణాల్లో అక్రమాలు బయటపడ్డాయి. దీంతో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం శాఖాపరమైన విచారణ జరుగుతోంది. తదుపరి చర్యలకు డీసీఏ సిద్ధమవుతోంది.
ఫ సికింద్రాబాద్‌లోని ఓ జిమ్‌లో తనిఖీలు చేపట్టిన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు..గుండె వ్యాధులకు సంబంధించిన ఇంజెక్షన్లను అక్రమంగా వ్యాయామానికి వచ్చిన వారికి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 60 సూది మందునుస్వాధీనం చేసుకుని, జిమ్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.
ఫ గత నెల 20న నగరంలోపలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న మెడికల్ దుకాణాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన అధికారులు.. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదే రోజు సంగారెడ్డి జిల్లా, మల్లేపల్లిలో అనధికారికంగా నిల్వ ఉంచిన మందులను సీజ్ చేశారు. ఇవి ఉదాహరణకు కొన్ని మాత్రమే. ఇటీవల కాలంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. దీంతో మెడికల్ షాపుల్లోని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడుల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు
నాలుగు దుకాణాల సీజ్,350 షాపులకు నోటీసులు


