
శ్రీశైలం ఆలయ బోర్డు సభ్యుడికి సన్మానం
షాద్‌నగర్: శ్రీశైలం ఆలయ బోర్డు సభ్యుడిగా నియామకం కావడం తన పూర్వజన్మ సుకృతమని చిలివేరి కాశీనాథ్ అన్నారు. ఫరూఖ్‌నగర్‌లోని శ్రీవేంకటేశ్వరాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బక్కని నర్సింలు, నాయకులు కోట జనార్దన్, దాస కృష్ణయ్య, ఒగ్గు కిషోర్, చిన్న బాల్‌రాజ్, బాస రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
డీసీఎం బోల్తా : డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
కేశంపేట: కోళ్ల దాణా తీసుకెళ్తున్న డీసీఎం బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని సంతాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చేగుంట గ్రామ నుంచి బుధవారం సంతాపూర్‌కు కోళ్ల దాణా డీసీఎంలో తీసుకొస్తున్నారు. సంతాపూర్ శివారుకు రాగానే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
శభాష్ శివకుమార్
బస్సు కింద పడ్డ వ్యక్తిని కాపాడిన
ట్రాఫిక్ కానిస్టేబుల్
సుభాష్‌నగర్: బస్సు రూపంలో మృత్యు ఓడిలోకి వెళ్తున్న ఓ వాహనదారుడిని రెప్పపాటులో ట్రాఫిక్ పోలీస్ కాపాడిన ఘటన సూరారం చౌరస్తాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం బాలానగర్ నుండి మెదక్ వైపు ఆర్టీసీ బస్సు వెళుతోంది. ఈ క్రమంలో బస్సు పక్క నుండి ఓ ద్విచక్ర వాహనదారుడు వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు కింద మధ్యలో పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న జీడిమెట్ల ట్రాఫిక్ మార్షల్ కట్టబోయిన శివకుమార్ క్షణాల్లో పరిగెత్తి అతన్ని బస్సు కింద నుండి లాగడంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. క్షణం ఆలస్యం అయితే బస్సు వెనుక చక్రాలు ద్విచక్ర వాహనదారుడు పైనుంచి వెళ్లేవి. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. అతనిని కాపాడిన దృశ్యాలు పక్కనే ఉన్న షాప్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అ దృశ్యాలు స్థానికంగా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో వందలాదిమంది శివకుమార్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు.
రిమాండ్‌కు లైంగిక దాడి కేసు నిందితుడు
సైదాబాద్: బాలుడిపై లైంగిక దాడి కేసులో నిందితుడిని సైదాబాద్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సైదాబాద్ జైల్‌గార్డెన్‌లోని ప్రభుత్వ బాలల సదనంలో ఒక బాలుడిపై స్టాఫ్‌గార్డ్‌గా విధులు నిర్వహించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రహమాన్ లైంగిక దాడి చేసిన సంగతి విదితమే. బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు నిందితుడు రహమాన్‌పై పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసారు. బుధవారం అతడిని సైదాబాద్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

శ్రీశైలం ఆలయ బోర్డు సభ్యుడికి సన్మానం