
ఎమ్మెల్యేను కలిసిన చిరువ్యాపారులు
చేవెళ్ల: రైతు బజార్‌కు సరైన స్థలం కేటాయించకపోవడంతో గిరాకీ రావడం లేదని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని బుధవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య దృష్టికి తీసుకెళ్లారు. క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఎండోమెంట్ ఖాళీ స్థలంలో కొనసాగుతున్న దుకాణాలను తొలగించాలని ఆ శాఖ అధికారులు ఆదేశించారన్నారు. మార్కెట్ కమిటీ అధికారులు స్పందించి దుకాణ స్థలాలకు నంబర్లు కేటాయించాలని కోరారు. లేదంటే వ్యాపారుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులైన మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ బి.రాములు, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకులు ఆగిరెడ్డి, శ్రీనివాస్ తదితరులకు సూచించారు. దీంతో వారు వెళ్లి దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడటంతో సమస్య సద్దుమణిగింది.
దుకాణ స్థలాలకు నంబర్లు
కేటాయించాలని వినతి