
అండర్–14 కబడ్డీలో రాష్ట్రస్థాయికి ఎంపిక
కందుకూరు: మండల పరిధిలోని కటికపల్లికి చెందిన హరీశ్‌గౌడ్ అండర్–14 కబడ్డీలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. హరీశ్‌గౌడ్ కందుకూరులోని శ్రీచైతన్య స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో బుధవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అండర్–14 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు సంగారెడ్డిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ డిసెంబర్ 4కు వాయిదా
సిటీ కోర్టులు : రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ బుధవారం నాంపల్లి కోర్టులో జరిగింది. నాంపల్లిలోని 14 అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో జరిగిన ఈ కేసు విచారణకు ఇప్పటికే బెయిల్ పై బయటికి వచ్చిన ఆరుగురు (ప్రభాకర్‌రావు , ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్, శ్రవణ్‌కుమార్) నిందితులు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు సప్లిమెంటరీ చార్జిిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ విచారణలో జడ్జి సెలవులో వెళ్లడంతో తదుపరి విచారణ డిసెంబర్ 4కు వాయదా పడింది. నాగార్జున పరువునష్టం కేసు 30కి వాయిదా మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ బుధవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో జరిగింది. ఈ విచారణకు పిటిషనర్ నాగార్జున, ప్రతివాది కొండా సురేఖ గైర్హాజరయ్యారు. దీంతో వారి తరుఫునా న్యాయవాదులు పిటిషన్లను దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖను క్రాస్‌ఎగ్జామినేషన్ చేయాల్సి ఉండగా ఆమె గైర్హాజరు కావడంతో విచారణను కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.