
మున్సిపల్ కార్మికుల డిమాండ్లు తీర్చాలి
తుర్కయంజాల్: మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26వేల పెంచాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ అన్నారు. పురపాలక సంఘం పరిధి రాగన్నగూడ ఎన్‌ఎస్‌ఆర్ నగర్‌లోని చలసాని కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న రాష్ట్ర 5వ మహాసభల్లో భాగంగా బుధవారం రెండోరోజు ప్రతినిధుల సభ ప్రారంభానికి ముందు సీనియర్ కార్మికురాలు దుర్గమ్మ జెండా ఆవిష్కరణ చేశారు. మూడేళ్ల కాలంలో యూనియన్ నిర్వహించిన పోరాటాలను సమీక్షించుకుని, భవిష్యత్తు పోరాటాలకు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని, సహజంగా మరణించిన, అనారోగ్యంతో మరణించిన, 60ఏళ్లు పై బడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం యూనియన్ రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పాలడుగు భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా జనగం రాజమల్లు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పాలడుగు సుధాకర్, కోశాధికారిగా అశోక్‌తో పాటు 29 మందిని ఆఫీస్ బేరర్స్‌గా, 130 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు.