
నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు
వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య
నందిగామ: నాణ్యమైన విత్తనాలు నాటితేనే రైతులకు అధిక దిగుబడులు వస్తాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సమాచార, ప్రసార కేంద్రం ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య అన్నారు. మండల పరిధిలోని వీర్లపల్లి, అంతిరెడ్డిగూడ, ఈదులపల్లి తదితర గ్రామాల్లో బుధవారం పలువురు వ్యవసాయాధికారులతో కలిసి ఆమె పర్యటించి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేఎన్‌ఎం–1638 రకానికి చెందిన విత్తనాలు నాటిన రైతుల పంట పొలాలను పరిశీలించి పంట ఎదుగుదల, రైతుల అనుభవాలు, పంట ఆరోగ్యం తదితర విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు తాము నాటిన పంటల విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వెంటనే వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు. ఎల్లప్పుడూ నాణ్యమైన విత్తనాలనే నాటాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రామశివరాం, ఏఈఓలు శిరీష, రవీందర్, రవి, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.