
వరుసపెట్టి.. ఆరు కార్లు ఢీకొట్టి
● ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం
● ఇద్దరికి స్వల్ప గాయాలు
రాజేంద్రనగర్: ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న ఓ కారు వేగం ఒక్కసారిగా నెమ్మదించడంతో వెనుక వస్తున్న మరో ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసం కాగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నానికి చెందిన గంగాధర్ ఆదివారం మధ్యాహ్నం ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ మీదుగా గచ్చిబౌలి వైపు కారులో వెళ్తున్నాడు. హిమాయత్‌సాగర్ ప్రాంతంలోకి రాగానే కారు వేగాన్ని ఒక్కసారిగా తగ్గించాడు. దీంతో వెనకాలే వస్తున్న మరో ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొంటూ గంగాధర్ వాహనాన్ని ఢీకొట్టాయి. ఈ ఘటనలో మొత్తం ఆరు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. గంగాధర్‌తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన జరగడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.