
మద్యం మత్తులో విద్యుత్ టవరెక్కి హల్‌చల్
మైలార్‌దేవ్‌పల్లి/జవహర్‌నగర్: మద్యం మత్తులో ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడ వాంబే కాలనీకి చెందిన ఇంజమూరి వేణు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆదివారం ఉదయం ఇతను పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇంటి పక్కనే ఉన్న మల్లారెడ్డి, శిరీష అనే ఇద్దరు తనను కొట్టారని ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేయగా...తన ఇంటి పక్కనే ఉన్న వారికి వేణు గతంలో డబ్బులు ఇచ్చాడని, ఆ డబ్బులు ఇవ్వమని మద్యం మత్తులో వెళ్లి అడుగగా వారు అతన్ని బెదిరించి పంపించారని తేలింది. ఈ క్రమంలోనే వేణు తను అప్పుగా ఇచ్చిన రూ.1500 ఇవ్వడం లేదని పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. మద్యం మత్తులో పోలీసులను కూడా ఇబ్బంది పెట్టడంతో వారు నచ్చజెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఇంతలోనే వేణు బయటకు వెళ్లి తనకు న్యాయం జరగడం లేదంటూ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న 33 కేవీ హైటెన్షన్ పోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించి కరెంటు సరఫరా నిలిపివేయించారు. అనంతరం ఘటన స్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మక్సూద్, ఎస్‌ఐలు పైడినాయుడు, విశ్వనాథ్‌రెడ్డి, డీఆర్‌ఎఫ్ బృందాలు కలిసి పైకి ఎక్కిన వేణును బుజ్జగించి కిందకి దింపారు. అతన్ని వైద్యం నిమిత్తం ఆస్పత్రికి చేర్చారు. ఈ ఘటనతో దుర్గానగర్ నుంచి చంద్రాయణ గుట్ట వెళ్లే రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది.
జవహర్‌నగర్‌లో...
జవహర్‌నగర్ వికలాంగుల కాలనీలోనూ ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. పోలీసులు తెల్పిన మేరకు వెంకటేష్, లక్ష్మి దంపతులు కాగా ముగ్గురు పిల్లలతో కలిసి వికలాంగుల కాలనీలో ఉంటున్నారు. వెంకటేష్ మద్యానికి బానిసై ప్రతిరోజు భార్యను వేధింపులకు గురిచేసేవాడు. శనివారం భార్యా భర్తల మధ్య గొడవ పెద్దగా అవడంతో భార్య లక్ష్మి చేతులను విరగొట్టాడు. దీంతో లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తనని కొడతారనే భయంతో విద్యుత్ టవర్ ఎక్కి చనిపోతానంటూ బెదిరింపులకు దిగాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని వెంకటేష్‌ని కిందికి దించారు. అయితే వెంకటేష్ గతంలో కొన్నిసార్లు చనిపోతానంటూ ఆత్మహత్యా యత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో విద్యుత్ టవరెక్కి హల్‌చల్