
దైవ దర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం
● కొందుర్గుకు చెందిన బాలిక మృతి
కొందుర్గు: దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన స్థానికంగా కలచి వేసింది. స్థానికులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కొందుర్గు గ్రామానికి చెందిన దోరపల్లి అనిత తన కూతురు నిహారిక(13), కుమారుడు విఘ్నేష్‌తో కలిసి నందిగామకు చెందిన తమ బంధువు శ్రీను కుటుంబ సభ్యులతో శనివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి దర్శనం కోసం కారులో బయలుదేరారు. మార్గమధ్యలో హైదరాబాద్‌లోని ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నిహారికకు తీవ్ర గాయాలు కాగా విఘ్నేష్‌కు కాలు విరగడంతోపాటు అనితకు గాయాలయ్యాయి. స్థానికులు, బంధువులు క్షతగాత్రులను నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. నిహారిక పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి బాలిక మృతి చెందింది. మృతురాలు కొందుర్గు ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతుంది. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. గాయాలైన అనిత, విఘ్నేష్‌లు ఆసుపత్రి నుంచి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దైవ దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

దైవ దర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు