
కాంగ్రెస్‌కు ఓటుతో గుణపాఠం చెప్పండి
వెంగళరావునగర్: ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని హైలాంకాలనీ, శ్రీకృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆయన ర్యాలీ నిర్వహించి ప్రజలను స్వయంగా కలుసుకుని కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటు వేయడమంటే మన వేలితో మనం పొడుచుకోవడమే అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులను, డబ్బును నమ్ముకున్నదేగాని, ప్రజలకు చేసిన వాగ్దానాలను మరచిపోతున్నట్టు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు డబ్బులకో, మద్యం సీసాలకో అమ్ముడు పోవద్దని సూచించారు. రేవంత్ పంచే డబ్బులు, మద్యం సీసాలను ఎదురించి బీఆర్‌ఎస్ పార్టీకి ఓటేయాలని తెలియజేశారు. గత కొన్నేళ్ళుగా ఇక్కడ దివంగత ఎమ్మెల్యే మాగంటి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని కోరారు. గోపీనాథ్ ఎలాగైతే సేవలందించారో అదే విధంగా సునీత కూడా అందిస్తారని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారని, ఆయనకు మనం నివాళులర్పించడమంటే సునీతను గెలిపించడమేనని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలకు 203 గురుకులాలు పెట్టి దేశంలోనే అత్యంతగా గౌరవించింది కేసీఆర్ మాత్రమేనన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మరిచారని, ప్రజలకు గ్యారంటీ కార్డులు ఇచ్చి మరచిన కాంగ్రెస్‌ను ఓడించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కార్పొరేటర్లు దేదీప్య విజయ్, రాజ్‌కుమార్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు