
ఫోను చోరీ.. ఖాతా ఖాళీ!
ప్రయాణికుడి సెల్‌ఫోన్ తస్కరించిన ఆటోడ్రైవర్
సాక్షి, సిటీబ్యూరో: తన ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి సెల్‌ఫోన్ తస్కరించిన ఆటోడ్రైవర్ అందులో ఉన్న ఫోన్‌పే యాప్ ఆధారంగా బాధితుడి బ్యాంకు ఖాతా ఖాళీ చేశాడు. ఈ వ్యవహారంలో అతడికి కారు డ్రైవర్‌తో పాటు కూరగాయల వ్యాపారి సహకరించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ దార కవిత శుక్రవారం వెల్లడించారు. ఈస్ట్ ఆనంద్ బాగ్‌లోని ఎన్‌ఎండీసీ కాలనీకి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి (68) గత నెల 17 రాత్రి ఉప్పల్ నుంచి తార్నాక వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో బాలానగర్‌కు చెందిన మహ్మద్ మొయినుద్దీన్ నడిపే షేర్ ఆటో ఎక్కారు. అదే ఆటోలో మొయినుద్దీన్ స్నేహితుడైన కారు డ్రైవర్ మహ్మద్ సయ్యద్ సల్మాన్ కూడా ఉన్నాడు. ఆటో ఎక్కిన వెంటనే తనకు చెల్లించాల్సిన మొత్తం ఫోన్‌పే ద్వారా బదిలీ చేయాలంటూ బాధితుడిని మొయినుద్దీన్ కోరాడు. దీంతో తన ఫోన్ అన్‌లాక్ చేసి, దానిలోని ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసిన బాధితుడు నిర్ణీత మొత్తం క్యూర్ కోడ్ స్కానింగ్ ద్వారా మొయినుద్దీన్‌కు బదిలీ చేశాడు. ఆ సందర్భంలో అతగాడు బాధితుడి ఫోన్‌తో పాటు ఫోన్‌పేలకు సంబంధించిన ఆన్‌లాక్, నగదు బదిలీకి సంబంధించిన పిన్స్ తెలుసుకున్నాడు. ఆపై ఆటోలో ప్రయాణిస్తుండగా సల్మాన్‌తో కలిసి బాధితుడి దృష్టి మరల్చడం ద్వారా ఫోన్ తస్కరించాడు. ఈ విషయం గమనించని బాధితుడు తార్నాకలో దిగిపోయారు. తన ఇంటికి చేరిన తరవాత ఫోన్ పోయిన విషయం గుర్తించిన బాధితుడు మర్నాడు సిమ్ బ్లాక్ చేయించి వేరేది తీసుకున్నారు. బాధితుడి ఆ ఫోన్‌లోని యాప్ వినియోగించిన నిందితులు 17 నుంచి 20వ తేదీ వరకు 13 లావాదేవీల ద్వారా రూ.1.95 లక్షలు కాజేశారు. అన్‌లాక్, నగదు పేమెంట్స్‌కు సంబంధించిన పిన్స్ తెలిసి ఉండటంతో వీరి పని తేలికై ంది. పెట్రోల్ బంకుల్లో చెల్లింపులకు, బదిలీ ద్వారా నగదు తీసుకోవడం చేసి కాజేశారు. ఈ మొత్తంలో కొంత ఎంఎం పహాడ్‌కు చెందిన కూరగాయల వ్యాపారి మహ్మద్ హుస్సేన్ సహకారంతో స్వాహా చేశారు. అతడి సహకారంతో బాధితుడి ఫోన్‌పే ఖాతా నుంచి రూ.90 వేల వివిధ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌కి పంపారు. అట్నుంచి హుస్సేన్ ఖాతాలోకి మళ్లించి నగదు డ్రా చేసి ఇచ్చాడు. ఈ మొత్తాన్ని ముగ్గురు నిందితులూ పంచుకున్నారు. గత నెల 20న రూ.5 వేల లావాదేవీకి సంబంధించిన సందేశం తన ఫోన్‌కు రావడంతో బాధితుడు షాక్ అయ్యాడు. బ్యాంకు ఖాతాను సరిచూసుకోగా మొత్తం రూ.1.95 లక్షలు పోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ పి.ప్రమోద్ కుమార్ నేతృత్వంలో ఎస్సై షేక్ అజీజ్ తన బృందంతో ఈ కేసు దర్యాప్తు చేశారు. బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
మరో ఇద్దరితో కలిసి ఫోన్‌పే ద్వారా నగదు స్వాహా
ముగ్గురిని అరెస్టు చేసినసిటీ సైబర్ క్రైమ్ పోలీసులు

ఫోను చోరీ.. ఖాతా ఖాళీ!

ఫోను చోరీ.. ఖాతా ఖాళీ!

ఫోను చోరీ.. ఖాతా ఖాళీ!