
ఇద్దరు దోపిడీ దొంగల అరెస్టు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బోరబండ ఎస్సార్టీనగర్‌లో నివసించే పసుపులేటి అన్వేష్ అలియాస్ అన్నూ(24) ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తుండగా, బోరబండకే చెందిన మహ్మద్ సోహైల్(24) డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు. వీరికి అల్లాపూర్‌కు చెందిన ఎండీ అజర్(23)తో పాటు మరో మైనర్ బాలుడు తోడయ్యాడు. వీరంతా రాత్రిపూట వీధుల్లో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని దారికాచి కత్తులు, బ్లేడ్లతో బెదిరిస్తూ సెల్‌ఫోన్లు, గొలుసులు, నగదు దోచుకుంటున్నారు. గత నెల 30వ తేదీన సినిమా షూటింగ్‌ల్లో పనిచేసే రహమత్‌నగర్ నివాసి సాదిక్ షూటింగ్ ముగించుకుని వెళ్తుండగా మెట్రో పిల్లర్ నెంబర్ 1540 వద్ద నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన ఈ నలుగురు అడ్డగించి కొట్టి సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కొని పరారయ్యారు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు యూసుఫ్‌గూడ చెక్‌పోస్టులో నిఘా వేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్‌తో పాటు డ్యూయో బైక్‌ను స్వాధీనం చేసుకుని అన్వేష్, సోహైల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు అజర్ పరారీలో ఉండగా, మైనర్ బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ఇద్దరు దోపిడీ దొంగల అరెస్టు