రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Sep 7 2025 8:38 AM | Updated on Sep 7 2025 8:38 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఇబ్రహీంపట్నం రూరల్‌: విధులు ముగించుకుని ఇంటికి తిరిగివెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ ప్రైవేటు ఉద్యోగి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. మహేశ్వరం మండలం మంకాల గ్రామానికి చెందిన బరిగెల నర్సింగ్‌రావు (27) రావిర్యాలలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజులాగే శుక్రవారం విధులకు హాజరై అర్ధరాత్రి తన బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. సర్వీస్‌రోడ్డు రావిర్యాల కమాన్‌ వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నర్సింగ్‌రావు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. నర్సింగ్‌రావుకు ఏడాది క్రితమే వివాహం అయ్యింది.

బెల్ట్‌ షాపులపై పోలీసుల దాడి

మొయినాబాద్‌: డ్రై డే రోజు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌ షాపులపై పోలీసులు దాడి చేశారు. మండల పరిధిలోని అమ్డాపూర్‌లో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో శనివారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. శ్రీనివాస కిరాణ షాపులో ఆరు లీటర్ల మద్యం, రాజు కిరాణ షాపులో ఆరు లీటర్ల బీర్లు, జి.ప్రభాకర్‌ కిరాణ షాపులో 15 లీటర్ల బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

రేపు కోకాపేటకు సీఎం రాక

గోదావరి జలాల తరలింపు పనులకు శ్రీకారం

మణికొండ: హైదరాబాద్‌ ప్రజలకు గోదావరి తాగునీటి తరలింపు, ఉస్మాన్‌సాగర్‌(గండిపేట), హిమాయత్‌సాగర్‌లను నింపటం, మూసీ పునరుద్ధరణ పనులను ప్రారంభించేందుకు ఈ నెల 8వ తేదీ (సోమవారం) ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కోకాపేటకు వస్తున్నారని ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ వెల్లడించారు. కోకాపేట నియోపోలీస్‌ లేఅవుట్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైకి వెళ్లేందుకు నిర్మించిన ఫ్లై ఓవర్‌ ట్రంపెట్‌ను సీఎం ప్రారంభిస్తారని వివరించారు. శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాల అనంతరం బహిరంగ సభ ఉంటుందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. తాగునీటి తరలింపు పనులను జలమండలి వారు రూ.7,360 కోట్ల వ్యయంతో చేపడుతున్నారని తెలిపారు. మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి ఫేజ్‌–1, ఫేజ్‌–2ల రూపంలో నీటిని గండిపేట పక్కనే నిర్మిస్తున్న భారీ రిజర్వాయర్‌ వరకు తరలిస్తారని చెప్పారు. అక్కడి నుంచి గండిపేటలోకి నీటిని వదలటం, అది నిండిన తరువాత హిమాయత్‌సాగర్‌కు మళ్లించటం వంటివి చేపడతారని పేర్కొన్నారు. రెండు జలాశయాల ద్వారా మూసీ నదిలోకి నీరు వదలటం వల్ల అందులో ఎప్పటికీ నీటి ప్రవాహం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జలమండలి, హెచ్‌ఎండీఏ అధికారులు, గుడి మల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లేష్‌ ముదిరాజ్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement