
కుక్కను తప్పించబోయి..
● ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన కారు
● ముగ్గురికి గాయాలు
మొయినాబాద్: అతివేగంగా వెళ్తున్న కారు అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జువగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మొయినాబాద్ పీఎస్ పరిధిలోని అమ్డాపూర్ రోడ్డులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అతని స్నేహితులు అభిలాష్, ఆనంద్, గురు, మౌలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. శనివారం వీరంతా టీఎస్ 09 ఎఫ్‌డబ్ల్యూ 2607 నంబరు కారులో శంషాబాద్ మండలంలో ఓపెన్ ప్లాట్లు చూసేందుకు వెళ్లారు. సాయంత్రం 5.20 గంటలకు తిరిగి అమ్డాపూర్ మార్గంలో వెళ్తుండగా నజీబ్‌నగర్– ముర్తూజగూడ మధ్య కుక్క అడ్డుగా వచ్చింది. దీన్ని తప్పించే క్రమంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న సాయికృష్ణ హ్యాండ్ బ్రేక్ వేశాడు. దీంతో కారు రోడ్డు ఎడమ వైపునకు దూసుకుపోయి, పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి విద్యుత్ తీగలు తెగిపోయి, ట్రాన్స్‌ఫార్మర్ కారుపై పడింది. అప్పటికే వైర్లు తెగిపోవడంతో ఎవరికీ షాక్ తగలలేదు. డ్రైవింగ్ సీట్లో ఉన్న సాయికృష్ణ కారులోనే ఇరుక్కుపోయాడు. ఇతనితో పాటు మరో ఇద్దరికి గాయాలు కాగా, మిగిలిన ఇద్దరు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు గడ్డపారతో డోర్లు తొలగించి అందరినీ బయటకు లాగారు. ప్రమాదంతో భయాందోళనకు గురైన సాయికృష్ణ స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని 108లో ఆస్పత్రికి తరలించారు. ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

కుక్కను తప్పించబోయి..