
‘నవోదయ’లో క్లస్టర్ స్పోర్ట్స్ మీట్
హాజరైన వివిధ జిల్లాల నవోదయ విద్యార్థులు
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరులో జవహర్ నవోదయ విద్యాలయలో బుధవారం క్లస్టర్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. తొలుత ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసులు క్రీడా పతాకాన్ని ఎగురవేయగా, క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సత్తా చాటడం ద్వారా ఉన్నత స్థాయికి చేరొచ్చని చెప్పారు. ఇక్కడ పోటీల్లో ప్రతిభ చాటిన 250మందిని రీజినల్ స్థాయికి ఎంపికచేస్తామని తెలిపారు.
345 మంది క్రీడాకారులు
పాలేరు నవోదయలో మొదలైన క్లస్టర్ స్థాయి పోటీలకు పాలేరుతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నవోదయ విద్యాలయాల విద్యార్థులు 345 మంది హాజరయ్యారు. ఇందులో 183 మంది బాలురు, 162 మంది బాలికలు ఉన్నారు. వీరికి అండర్–14, 17, 19 విభాగాల్లో బ్యాడ్మింటన్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, ఖో–ఖో, యోగా పోటీలు నిర్వహిస్తుండగా గురువారంతో ముగియనున్నాయి.
విద్యార్థులకు నచ్చేలా వండాలి
తెలంగాణ ట్రైబుల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కోఆర్డినేటర్ నాగార్జునరావు
మహేశ్వరం: హాస్టల్ విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని అందించాలని తెలంగాణ ట్రైబుల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రిజినల్ కోఆర్డినేటర్ నాగార్జునరావు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని ఉప్పుగడ్డతండా సమీపంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో హాస్టళ్లలో పని చేస్తున్న వంట మనుషులకు(హెడ్ కుక్) శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తినడానికి ఇష్టపడని కూరగాయలను కూడా వారికి నచ్చేలా వంట చేయాలన్నారు. వండేటప్పుడు కూరగాయలు, ఆకుకూరలను ఉప్పునీటిలో ఆరగంట నానబెట్టి శుభ్రంగా కడగాలని సూచించారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం గిరిజన గురుకుల హాస్టల్ ప్రిన్సిపాల్ ఎన్.నళినిమోహన్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్ హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు బి.బాలాజీ, యాదగిరి, నాలుగు జిల్లాల హెడ్‌కుక్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
ఒకరికి స్వల్ప గాయాలు
మొయినాబాద్: అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్న వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటలకు లింగంపల్లి నుంచి అమ్డాపూర్ వైపు వెళ్తున్న కారు కాశీంబౌలి గేటు మూలమలుపు వద్ద అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో పోల్ విరిగిపడింది. కారు పల్టీలు కొడుతూ కిందికి దూసుకెళ్లి ఆగిపోయింది. కారు ఢీకొట్టగానే విరిగిన స్తంభం తీగల నుంచి వేరుకావడంతో స్తంభం మాత్రమే కిందపడింది. లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉందేదని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మూలమలుపు వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరో చోటకు మార్చాలని కోరారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
లారీని ఢీకొన్న కారు
ఒకరికి గాయాలు
మైలార్‌దేవ్‌పల్లి: వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టడంతో ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. బాబుల్‌రెడ్డినగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం అతను బడంగ్‌పేట్‌కు వెళ్తున్నాడు. అదే సమయంలో బాబుల్‌రెడ్డినగర్ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో శ్రీనివాస్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీలో ఇరుక్కుపోయిన కారును జేసీబీతో బయటికి లాగారు. గాయపడిన శ్రీనివాస్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘నవోదయ’లో క్లస్టర్ స్పోర్ట్స్ మీట్