
ముఠాగా ఏర్పడి.. మొబైళ్లు కొట్టేసి
మీర్‌పేట: రద్దీ ఉన్న ప్రాంతంలో సంచరిస్తూ మొబైల్ ఫోన్‌లు చోరీలకు పాల్పడుతున్న 5 మంది అంతర్రాష్ట్రలోని ముఠాలోని మహిళా నేరస్తురాలితో మరో ముగ్గురిని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్ ఎస్‌ఓటీ, మీర్‌పేట్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 473 మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్ నందనవనానికి చెందిన గారేడి మహేష్, భూషేష్‌గుప్తానగర్ కాలనీ చెందిన సల్లంగుల నరేష్, ఏపీలోని అనంతపురానికి చెందిన కుమ్మరి గోపి అలియాస్ ఆకుల గోపి, కర్నూల్‌కు చెందిన నగునూరి నాగమణి, ఆమె భర్త నగునూరి సాయికుమార్ మీర్‌పేట్‌లోని భూషేష్‌గుప్తా నగర్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. సాయికుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా వీరందరూ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారం రద్దీగా ఉండే బస్సు స్టాప్‌లు, కూరగాయల మార్కెట్లు, దుకాణాలు, కూరగాయలు కొనుగోలు చేసే వ్యక్తులను ఎంపిక చేసుకుంటారు. బస్సుల్లో ఎక్కుతారు. నరేష్, గోపిలు వారు ఎంపిక చేసుకున్న వ్యక్తులను బస్సులో నెట్టి వేస్తుంటారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్‌లను కొట్టేస్తారు. చోరీ చేసిన ఫోన్‌లను నాగమణి, సాయికుమార్‌లకు అందజేస్తారు. వారు ఇతర ప్రాంతాల్లో విక్రయించి వచ్చిన డబ్బులను అందరూ సమానంగా పంచుకుని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట్, మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు దర్యాప్తు చేపట్టి ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 470 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులు తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాలలో పలు దొంగతనాలు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో మీర్‌పేట్, ఎస్‌ఓటీ పోలీసులు పాల్గొన్నారు.
చోరీలకు పాల్పడుతున్న
నిందితుల అరెస్టు
రూ.50 లక్షల విలువైన
473 ఫోన్‌లు స్వాధీనం