
‘అభయహస్తం’ అందేనా?
మోమిన్‌పేట: అభయ హస్తం పథకంలో భాగంగా తాము చెల్లించిన డబ్బులను వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు. ఈ స్కీమ్ ఆగిపోయి పదకొండేళ్లు కావస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అప్పట్లో డబ్బులు కట్టిన 1,18,712 మంది ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై సర్కారు నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో స్తబ్దత నెలకొంది. ఉద్యోగులు విరమణ పొందిన తర్వాత పెన్షన్ పొందుతున్న మాదిరిగానే సామాన్య, పేద మహిళలు కూడా వృద్ధాప్యంలో పింఛన్ తీసుకోవాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. 18 ఏళ్లు పైబడి 59 సంవత్సరాల లోపున్న డ్వాక్రా సంఘాల్లోని మహిళలు దీనికి అర్హులని పేర్కొన్నారు. వీరు నిత్యం రూపాయి చొప్పున జమ చేస్తే.. ప్రభుత్వం తరఫున రూపాయి జత చేస్తారు. ఇలా అర్హత ఆధారంగా 60 సంవత్సరాలు పైబడిన మహిళలకు ప్రతినెలా రూ.500 నుంచి రూ.5 వేల పెన్షన్ అందుతుందని ప్రభుత్వం అప్పట్లో ప్రచారం చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో 1,18,712 మంది పథకంలో చేరారు. నాలుగేళ్లు సజావుగా సాగిన లావాదేవీలు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత స్తంభించిపోయాయి. సభ్యుల నుంచి ప్రీమియం తీసుకోలేదు. మండలంలోని 28 గ్రామ పంచాయతీల పరిధిలో 2,575 మంది మహిళలు అభయహస్తంలో సభ్యులుగా చేరారు. 2012– 13 మార్చి నాటికి వీరు చెల్లించి ప్రీమియం సొమ్ము రూ.5 లక్షలకు పైగానే ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం తమ డబ్బులు తిరిగి చెల్లించాలని సభ్యులు కోరుతున్నారు.
ప్రీమియం డబ్బులు వడ్డీతో సహా
తిరిగివ్వాలని మహిళల అభ్యర్థన
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,18,712 మంది ఎదురుచూపు
ఆదేశాలు రాలేదు
అభయహస్తం ప్రీమియం డబ్బుల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. గ్రామాలకు వెళ్తే తాము చెల్లించిన డబ్బులను వడ్డీతో కలిపి ఇవ్వాలని మహిళలు అడుగుతున్నారు.
– రాజు, ఐకేపీ ఏపీఎం, మోమిన్‌పేట

‘అభయహస్తం’ అందేనా?