
కుక్కల దాడిలో 21 గొర్రెలు మృతి
● కేశంపేట మండలం చౌలపల్లిలో ఘటన ● బాధితుడికి రూ.2 లక్షల నష్టం
కేశంపేట: కుక్కల దాడిలో 21 గొర్రెలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చౌలపల్లిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎలిగపల్లి కృష్ణయ్య గొర్రెల పెంపకంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలంలోని దొడ్లో జీవాలను తోలాడు. మంగళవారం రాత్రి కుక్కలు మూకుమ్మడిగా మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో 21 జీవాలు చనిపోగా పలు తీవ్రంగా గాయపడ్డాయని బాధితుడు తెలిపాడు. సుమారు రూ.2 లక్షలు నష్టపోయానని, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య చౌలపల్లిలోని రైతు పొలానికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షురాలు రొల్లు రాధిక, నాయకులు పసుపుల ప్రశాంత్, రఘురాంగౌడ్, కృష్ణయ్య, రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.