
సమోసాలో బల్లి!
మొయినాబాద్: స్వీట్ షాపులో సమోసాలు తిన్నవారికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. సమోసాలో బల్లి దర్శనమివ్వడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గేటు వద్ద కలకలం రేపింది. చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కుమార్ తన కూతురు సంజనతో కలిసి బుధవారం మొయినాబాద్‌లో కూరగాయలు విక్రయించడానికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూ మార్గ మధ్యలో తోలుకట్ట గేటు వద్ద స్వీట్ షాపులో సమోసాలు తీసుకుని, తింటుండగా అందులో బల్లి కనిపించింది. అప్పటికే రెండు సమోసాలు తిన్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అంతనలోనే సంజన వాంతులు చేసుకోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్వీట్ హౌస్ ఓనర్ షాపు మూసివేసి పారిపోయాడు. ఈ విషయమైన బాధితులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.