
సమ్మెను జయప్రదం చేయండి
● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం
ఇబ్రహీంపట్నం: దేశవ్యాప్తంగా బుధవారం జరిగే సమ్మెలో కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం సోమవారం ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 లేబర్ చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతూ ఉద్యోగ భద్రతకు విఘాతం కలుగుతుందన్నారు. 8 గంటల పనిదినాలను 12 గంటలకు పెంచడం సరికాదన్నారు. కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉపాధి కూలీలకు 200 రోజులకు పని దినాలు పెంచి రూ.600 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, ప్రజా సంఘాల నాయకులు పగడాల యాదయ్య, చంద్రమోహన్, మధుసూదన్‌రెడ్డి, కందుకూరి జగన్, సుమలత, కవిత, ప్రకాష్‌కారత్, శంకర్, పి.జగన్ తదితరులు పాల్గొన్నారు.