
బాలికలను వేధిస్తే జైలుకే
తాండూరు రూరల్: పాఠశాలలు, కళాశాలల వద్ద బాలికలను వేధిస్తే జైలుకు పంపిస్తామని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న మోడల్ స్కూల్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాల్యం నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కష్టపడి చదివి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. బాలికలను వేధిస్తే పోక్సో చట్టం కింద జైలుకు పంపిస్తామన్నారు. మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ నగేష్, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీదేవి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.