భూములు లాక్కుంటే ఇక్కడే చస్తాం
మొయినాబాద్: ‘భూమినే నమ్ముకుని బతుకుతున్నాం.. బలవంతంగా లాక్కుంటే పెట్రోల్ పోసుకుని ఇక్కడే చస్తాం.. మా శవాల మీద గోశాల కట్టండి’ అంటూ ఎనికేపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రెవెన్యూ సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాల భూమిలో గోశాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు, గ్రామ స్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ రైతు ట్రాక్టర్‌తో భూమిని దున్నుతుండగా అడ్డుకున్న పోలీసులు అతన్ని స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆగ్రహానికి గురైన రైతులు నిరసన వ్యక్తంచేశారు. డైబ్బె ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములను గుంజుకుంటే తామెక్కడికి వెళ్లాలని వాపోయారు.
పేదల భూములు పెద్దలకు
జిల్లాలోని పేదల భూములను లాక్కుంటున్న ప్రభుత్వం పెద్దలకు కట్టబెడుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి కాడిగాళ్ల భాస్కర్ ఆరోపించారు. ఎనికేపల్లి భూముల వద్ద ఆందోళన చేపడుతున్న రైతులకు సీపీఎం, బీఆర్‌ఎస్ నాయకులు మద్దతుగా నిలిచారు. ప్రజా ఉపయోగం కోసం ప్రభుత్వం భూ సేకరణ చేయాల్సి వస్తే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం గ్రామసభ నిర్వహించి, ప్రజలతో చర్చించాలన్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకుడు దేవమొళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ.. మొయినాబాద్‌లోని విలువైన భూములపై ప్రభుత్వం కన్ను పడిందన్నారు. గోశాల ఏర్పాటుకు నల్లమల అటవీ ప్రాంతంలో చాలా భూములున్నాయని.. అక్కడ గోశాల ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. పచ్చని పంటలు పండే భూములపై పడొద్దని కోరారు.
రైతులతో అధికారుల చర్చలు
గోశాల కోసం సేకరించనున్న భూముల రైతులతో చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్‌కుమార్, ఏసీపీ కిషన్ బుధవారం సాయంత్రం చర్చలు జరిపారు. డిమాండ్లను చెబితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సూచించారు. దీనిపై స్పందించిన రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని కోరగా.. అది సాధ్యం కాదని తేల్చిచెప్పారు. మీ ఆధీనంలోని 99.14 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని.. రికార్డుల్లో ఎక్కడా మీ పేర్లు లేవని తెలిపారు. అయినా న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చలను సోమవారానికి వాయిదా వేశారు.
మా శవాలమీద గోశాల కట్టండి
ఎనికేపల్లి రైతుల ఆందోళన
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
మద్దతు తెలిపిన సీపీఎం, బీఆర్‌ఎస్ నేతలు


