ధ్యానంతో ఆరోగ్యం, మానసిక వికాసం
● సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్
● మహాపిరమిడ్‌లో ధ్యాన మహాయాగ వేడుకలు ప్రారంభం
కడ్తాల్: ప్రపంచ శాంతి కోసం మండల కేంద్రం సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో ఏటా నిర్వహిస్తున్న ధ్యాన మహాయాగ వేడుకలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధ్యానంతో ఆరోగ్యం, మానసిక వికాసం పెంపొందుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలని, ధ్యానంతో తమ జీవితాలను బాగు చేసుకోవాలని సూచించారు. ధ్యానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి పత్రీజీ అని, ధ్యానమయ సమాజం కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని కొనియాడారు. పత్రీజీ చూపిన ధ్యాన మార్గం సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా ఉందన్నారు. అంతకుముందు రాష్ట్రం నలుమూలల నుంచి తిరిగి వచ్చిన అఖండ జ్యోతికి కడ్తాల్‌లో ధ్యానులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి అఖండ జ్యోతితో పిరమిడ్ వద్దకు ర్యాలీగా చేరుకుని పిరమిడ్ శక్తి స్థల్ వద్ద అఖండ జ్యోతిని వెలిగించారు. అనంతరం పలువురు పిరమిడ్ మాస్టర్లు తమ సందేశాలు వినిపించారు. పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, పత్రీజీ సతీమణి స్వర్ణమాల పత్రీ, కూతురు పరిమళ పత్రీ, పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హ్మనంత్‌రాజ్, బుద్ద క్వాంటమ్ ఫౌండేషన్ సీఈఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.


