టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
షాద్‌నగర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం పట్టణంలోని మహబూబ్‌నగర్ రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన జగన్(38) వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై షాద్‌నగర్‌కు వచ్చారు. పట్టణంలోని ముఖ్య కూడలి మీదుగా మహబూబ్‌నగర్ రోడ్డు వైపు వెళుతుండగా లావణ్య బార్ ఎదురుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో వాహనం జగన్ పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ రాజేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


