రైతు సహకార సంఘం ఇన్‌చార్జిగా విజయ
తుర్కయంజాల్: రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలను రద్దు చేస్తూ శుక్రవారం ప్రకటించడంతో పాలకవర్గాలు బాధ్యతల నుంచి తప్పు కొన్నాయి. దీంతో ఆ స్థానాల్లో పర్సన్ ఇన్‌చార్జిలు బాధ్యతలను స్వీకరించారు. ఇందులో భాగంగా తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్, డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన కొత్తకుర్మ సత్తయ్య తప్పు కోవడంతో శనివారం సాయంత్రం, సరూర్‌నగర్ సర్కిల్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆర్.విజయ బాధ్యతలను స్వీకరించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.
28న దివ్యాంగుల సమావేశం
అబ్దుల్లాపూర్‌మెట్: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డికి తెలంగాణ ప్రతిభావంతుల వికలాంగుల సేవా సంఘం సభ్యులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ నెల 28న సంఘం తరఫున కుంట్లూరు డివిజన్ రాజీవ్‌గృహకల్పలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని ఎంపీని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బి.రాంచంద్రయ్య, సభ్యులు గ్యార మహేశ్, గొల్ల పాండు పాల్గొన్నారు.
పీజీ హాస్టల్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
గచ్చిబౌలి: పీజీ హాస్టల్ బాత్ రూమ్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ బాలరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మూసాపేట్‌కు చెందిన కొమ్మ శ్రీకాంత్ రెడ్డి గౌలిదొడ్డిలో హోమ్ ఇన్ మెన్స్ పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి బుర్రి రాకేష్ గత మూడేళ్లుగా అదే హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 19న రాత్రి అతను భోజనం చేసిన తర్వాత తాను ఉంటున్న 502 గదిలో నిద్రకు ఉపక్రమించాడు. మర్నాడు ఉదయం అతను బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన హాస్టల్ నిర్వాహకులు కిటికీలోంచి చూడగా బాత్‌రూమ్‌లో పడి ఉన్నాడు. తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హిమాయత్‌నగర్‌కు చెందిన మృతుడు బుర్రి రాకేష్ బంధువుల వివరాలు తెలియరాలేదన్నారు.


