
పల్లె మెరిసేలా..
పచ్చదనం పెంపొందేలా..
షాద్‌నగర్: పల్లెల్లో స్వచ్ఛదనం, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. పంచాయతీల్లో పారిశుద్ధ్య సమస్యలు పెరిగిపోవడం, సరిపడా కార్మికులు లేక పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదని గుర్తించింది. ఈ మేరకు పారిశుద్ధ్య జోన్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇంటింటా చెత్త సేకరణ.. తడి, పొడి వ్యర్థాల నిర్వహణ.. మురుగు కాల్వలు, అంతర్గత రహదారుల పరిశుభ్రత వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుంటోంది.
జోన్‌ల విభజన ఇలా..
జిల్లాలోని 19 మండలాల్లో 531 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులు అందుబాటులో లేరు. ప్రతి గ్రామంలోని ఇళ్లు, గ్రామ విస్తీర్ణం, కార్మికుల సంఖ్యకు అనుగుణంగా జోన్లుగా విభజిస్తున్నారు. పెద్ద పంచాయతీలైతే గరిష్టంగా నాలుగు, చిన్న పంచాయతీలైతే రెండు జోన్ల చొప్పున ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జోన్లను సూచిస్తూ పారిశుద్ధ్య మ్యాపును ఏర్పాటు చేస్తారు. జోన్‌ల పరిఽధిలో ఉండే ఇళ్లు, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల పొడవు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలను మ్యాపులో పొందుపరుస్తారు.
ఫొటోలు తీసి.. అప్‌లోడ్
షెడ్యూల్ ప్రకారం ఒక జోన్ పరిధిలో కార్మికులతో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయించి, సమస్యను పరిష్కరిస్తారు. మరుసటి రోజు మరో జోన్‌లో ప్రారంభిస్తారు. ఇలా జోన్‌ల ప్రకారం నాలుగు రోజులకు తగ్గకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్‌ఆర్)లో జోన్లలో చేస్తున్న పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. దీంతో ఏ జోన్‌లో పనులు ఏమేరకు జరిగాయో సులభంగా తెలుసుకోవచ్చు.
ఎరువుల తయారీ
పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా ఇళ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేయనున్నారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయనున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో కంపోస్టు షెడ్లు ఖాళీగా ఉన్నాయి. వాటిలో తడి చెత్త వేయడం ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసి నర్సరీల్లోని మొక్కలకు వేయడం లేదా విక్రయించడం చేస్తారు.
ఆదాయం పెంపునకు చర్యలు
పొడి చెత్త నుంచి సేకరించిన ప్లాస్టిక్, గాజు ఇతర వస్తువులను తుక్కు దుకాణాలకు పంపించి ఆదాయం పొందనున్నారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్‌కు జమ చేయనున్నారు. ఇందు కోసం ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను ఎంపీఓ, డీఎల్‌పీఓ, డీపీఓ, స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పల్లె ప్రగతి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.
ప్రభుత్వం స్వచ్ఛ ప్రణాళిక
పంచాయతీల్లో పారిశుద్ధ్య జోన్లు
చెత్త సమస్యకు సత్వర పరిష్కారం
పల్లె ప్రగతి యాప్‌లో ఎప్పటికప్పుడు ఫొటోల అప్‌లోడ్
జనాభా ఆధారంగా..
పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. పంచాయతీల్లో జనాభా ఆధారంగా జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పారిశుద్ధ్య పనితీరు మరింత మెరుగుపడుతుంది.
– సురేష్ మోహన్, జిల్లా పంచాయతీ అధికారి
పల్లెలు పరిశుభ్రం
గ్రామ పంచాయతీల్లో జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా పారిశుద్ధ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించవచ్చు. పల్లెలు పరిశుభ్రంగా ఉంటాయి.
– బన్సీలాల్, ఎంపీడీఓ, ఫరూఖ్‌నగర్

పల్లె మెరిసేలా..