
ఉపాధి హామీలో షెడ్ల నిర్మాణం
షాబాద్: పాడి రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం పశువుల షెడ్లు నిర్మాణానికి ముందుకు వచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని పశు పోషకుల్లో జాబ్ కార్డు కలిగి ఉన్నవారు పశువుల షెడ్ల నిర్మాణం చేపట్టవచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 8 మంది రైతులు పశువుల షెడ్లు నిర్మించుకున్నారు. గరిష్టంగా పశువుల షెడ్లుకు రూ.85 నుంచి రూ.90 వేల వరకు మంజూరు చేస్తున్నారు. పశువులకు ఎండావానల నుంచి కాపాడుకునేందుకు పాడి రైతుల కు ఇదో చక్కని అవకాశంగా ఉపయోగపడుతుంది.
షెడ్లకు బిల్లులు ఇలా
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు పశువుల షెడ్ల నిర్మాణం కోసం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. వాస్తవంగా ఐదు నెలల్లో 35 నిర్మించాల్సి ఉన్నప్పటికి 18 మంది రైతులు షెడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చారు. దీని నిర్మాణంలో బేస్‌మెంట్, లెంటల్, రూఫ్ లెవల్ స్థాయిలు ఉంటాయి. వీటి ఆధారంగా రైతులకు బిల్లులు వస్తాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈజీఎస్ అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శి మొత్తం బిల్లులను లబ్ధిదారులకు అందిస్తారు. కాగా, ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తే బిల్లులు సకాలంలో రావనే ఉద్దేశంతో అనేక మంది రైతులు పశువుల షెడ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. షాబాద్ మండలంలో 90 శాతం మంది అన్నదాతలున్నారు. వారి వద్ద ఎడ్లు, ఆవులు, గేదెలు ఉన్నాయి. వారికి షెడ్లు అవసరమే కానీ ఆర్థిక ఇబ్బందులు వల్ల కూడా అనేక మంది ముందుకు రావడం లేదు.
జాబ్‌కార్డు, తెల్లరేషన్‌కార్డు ఉండాలి
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఉపాధి జాబ్ కార్డుతోపాటు తెల్లరేషన్ కార్డులు కలిగి ఉండాలి. ఐదెకరాల కంటే తక్కువగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు అర్హుల. ఆవులు, ఎద్దులు, గేదెలు మూడుకన్నా ఎక్కువగా ఉండాలి. కోళ్లు అయితే 50 కన్నా ఎక్కువగా ఉండాలి. పశువుల షెడ్డు అవసరమని గ్రామ పంచాయతీ నుంచి అనుమతి, పశువులు కలిగి ఉన్నట్లు పశువైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. తెల్లరేషన్ కార్డు, జాబ్‌కార్డు, పంచాయతీ అనుమతి పత్రం, పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రాలతో ఉపాధి హామీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
పాడి రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం
అవగాహన కల్పిస్తున్న అధికారులు
రైతులు వినియోగించుకోవాలి
పాడి రైతులకు పశువుల షెడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి పశువుల షెడ్లు మంజూరు చేస్తాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. నిర్మాణ దశలను బట్టి బిల్లులు అందజేస్తాం. – వీరాసింగ్, ఏపీఓ, షాబాద్

ఉపాధి హామీలో షెడ్ల నిర్మాణం