పోలీస్..గో బ్యాక్!
గచ్చిబౌలి/రాయదుర్గం: ‘పోలీస్ గో బ్యాక్ ... సీఎం డౌన్ డౌన్’ అంటూ విద్యార్థుల నినాదాలతో హెచ్‌సీయూ క్యాంపస్ దద్దరిల్లింది. మంగళవారం కూడా వర్సిటీలో ఆందోళనలు కొనసాగాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వర్సిటీ భూములను పరిరక్షిస్తామని వారు నినదించారు. పోలీసులను వెంటనే వర్సిటీ నుంచి పంపేయాలని డిమాండ్ చేశారు.
తరగతుల బహిష్కరణ
హెచ్‌సీయూ విద్యార్థి సంఘాల పిలుపుతో సామూహికంగా తరగతులను బహిష్క రించారు. దీంతో వర్సిటీలో ఎలాంటి తరగతులు జరగలేదు. వ వైవిద్యాన్ని రక్షించాలని, భూములను అప్పగించాలని ప్లకార్డులతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పోలీసులకు క్యాంపస్‌లో ఏమి పని అని ప్రశ్నించారు. వెంటనే క్యాంపస్ నుంచి వారిని వెళ్లి పోయేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 400 ఎకరాలతో పాటు మొత్తం స్థలాన్ని యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం మెయిన్ గేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు.
విద్యార్థుల నినాదాలతో హోరెత్తిన హెచ్‌సీయూ
● కొనసాగిన ఆందోళనలు
● ఆ భూములను యూనివర్సిటీకే అప్పగించాలని డిమాండ్


