సభ్యత్వానికి ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

సభ్యత్వానికి ఆహ్వానం

Dec 11 2023 6:06 AM | Updated on Dec 11 2023 6:06 AM

యాచారం పీఏసీఎస్‌ కార్యాలయం 
 - Sakshi

యాచారం పీఏసీఎస్‌ కార్యాలయం

రైతులకు వ్యవసాయంలో సహకారం అందించేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పనిచేస్తాయి. వారికి ఆర్థిక సహకారం అందిస్తూ చేయూతనిస్తున్నాయి. సంఘం డైరెక్టర్లను ఓటు హక్కుతో ఎన్నుకోవాలనే నిబంధన ఉంది. సరైన అవగాహన లేక రైతులు తమ హక్కును కోల్పోతున్నారు.

యాచారం: వాటాధనం చెల్లించి.. గుర్తింపు కార్డు(ఓటు హక్కు) పొందాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) అధికారులు రైతులను ఆహ్వానిస్తున్నారు. పీఏసీఎస్‌లో సభ్యులుగా ఉండే డైరెక్టర్ల ఎన్నిక కోసం ఓటు హక్కు అవకాశం ఉంటుంది. పీఏసీఎస్‌లో ఉండే ఓటు హక్కు ద్వారా తమకు అనుకూలమైన డైరెక్టర్‌ను ఎన్నుకుని వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను తీర్చుకోవచ్చు. పంట కాలంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, యంత్రాల కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పడే అవకాశం ఉంటుంది. రైతులకు అవగాహన లేక పీఏసీఎస్‌లో గుర్తింపు కార్డు పొందలేక పోతున్నారు. తద్వారా తమకు నచ్చిన డైరెక్టర్‌ను ఎన్నుకోక రైతులు నష్టపోతున్నారు. యాచారం పీఏసీఎస్‌లో 24 గ్రామ పంచాయతీలకు గాను 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. మొత్తం సభ్యులు(గుర్తింపు కార్డు పొందినవారు) 7,920 మంది ఉన్నారు. 7,920 మంది సభ్యులు పీఏసీఎస్‌లో వివిధ రకాల రుణాలు తీసుకునే సమయంలో రూ.300 వాటాధనం చెల్లించి సభ్యత్వాలు తీసుకున్నారు. సభ్యులుగా గుర్తింపు కార్డు పొందిన రైతులు ప్రతీ ఐదేళ్లకోసారి డైరెక్టర్ల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

అవగాహన కల్పించినా స్పందన కరువు

మండల పరిధిలోని 24 పంచాయతీల్లో వ్యవసాయ భూములుండి, పట్టాదారు, పాసుపుస్తకాలున్న రైతులు 22 వేల మందికి పైగానే ఉన్నారు. యాచారం పీఏసీఎస్‌లో మాత్రం 7,920 మంది రైతులు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. పీఏసీఎస్‌ అధికారులు రుణాల వసూళ్లల్లో గ్రామాల పర్యటనలో రైతులను కలిసి సభ్యులుగా చేరాలని రూ.300 వాటాధనం చెల్లించి గుర్తింపు కార్డులు పొందాలని అవగాహన కల్పించినా రైతుల్లో స్పందన ఉండడం లేదు. కొంత మంది రైతులు దీర్ఘకాలిక, స్వల్పకాలిక, వ్యవసాయ పంట రుణాలు పొందినా గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారు. నందివనపర్తి, యాచారం, మొండిగౌరెల్లి, చింతపట్ల, చింతుల్ల, గునుగల్‌, గడ్డమల్లయ్యగూడ, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, నల్లవెల్లి తదితర గ్రామాల్లో గుర్తింపు కార్డులు లేని వేలాది మంది రైతులు ఉన్నారు.

మూడు నెలల్లోనే సభ్యత్వం..

పీఏసీఎస్‌లో రూ.300 వాటాధనం చెల్లించిన రైతులకు మూడు నెలల్లోనే సభ్యత్వం ఇచ్చి గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. ఐడీ కార్డులు పొందిన ప్రతీ రైతుకు పీఏసీఎస్‌ ఎన్నికల్లో డైరెక్టర్లను ఎన్నుకోవడం కోసం ఓటు హక్కు ఉంటుంది. గ్రామాల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మాదిరిగానే పీఏసీఎస్‌ డైరెక్టర్ల ఎన్నికలకు సైతం డిమాండ్‌ ఉంటుంది. పీఏసీఎస్‌లో రుణాలు పొందని రైతులు నేరుగా అక్కడ ఉండే సీఈఓను కలిసి కొత్త పట్టాదారు, పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు, ఎన్‌ఓబీ జిరాక్స్‌లతో పాటు 5 పాసు ఫోటోలు ఇచ్చి రూ.300 వాటాధనం చెల్లిస్తే గుర్తింపు కార్డులు ఇస్తారు. ఇలా వాటాధనం చెల్లించిన రైతులకు ప్రతి మూడు నెలలకోమారు జరిగే పీఏసీఎస్‌ సర్వసభ్యసమావేశాల్లో తీర్మాణించి అర్జీలు పెట్టుకున్న రైతులకు గుర్తింపు కార్డుల జారీకి అనుమతిస్తారు. కేవలం 150 మంది రైతులు మాత్రమే ప్రస్తుతం గుర్తింపు కార్డుల జారీకి అర్జీలు పెట్టుకున్నారు.

పీఏసీఎస్‌లతో రైతుల అభ్యున్నతి

రూ.300 వాటాధనం చెల్లింపుతోఅన్నదాతలకు ఓటుహక్కు

సభ్యులుగా చేరాలని కోరుతున్న అధికారులు

అవగాహన లేక డైరెక్టర్ల ఎన్నికకు దూరం

మూడు నెలలకు ఒకసారి..

పీఏసీఎస్‌లో రుణాలు పొందని రైతులు సైతం సభ్యులుగా చేరవచ్చు. రూ.300 వాటాధనం చెల్లించి, ఆధార్‌కార్డు, పట్టాదారు, పాసుపుస్తకం, ఎన్‌ఓబీ జిరాక్స్‌ పత్రాలు ఇస్తే గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. ప్రతీ మూడు నెలలకు ఒకసారి జరిగే పీఏసీఎస్‌ సర్వసభ్య సమావేశంలో తీర్మాణించి అర్జీలు పెట్టుకున్న రైతులకు ఓటు హక్కు పొందే గుర్తింపు కార్డులు అందజేస్తాం. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

– నాగరాజు, సీఈఓ, పీఏసీఎస్‌ యాచారం

రైతులు సభ్యత్వం పొందాలి

మండలంలోని 24 పంచాయతీల్లో వ్యవసాయ భూమి ఉండి పట్టాదారు, పాసుపుస్తకాలున్న రైతులంతా పీఏసీఎస్‌లో సభ్యులుగా చేరాలి. డైరెక్టర్ల ఎన్నికల్లో తమకు సేవ చేసే డైరెక్టర్‌ను ఓటు హక్కుతో ఎన్నుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో సహకార సంస్థల్లోనూ రైతులకు వ్యవసాయ రంగంలో ఉపయోగించే యంత్రాలు గాని, ఎరువులు, విత్తనాలు రాయితీపై పొందే అవకాశం ఉంటుంది. రైతులకు మంచి గుర్తింపు ఉంటుంది.

– కొప్పు సుకన్య, ఎంపీపీ, యాచారం

పీఏసీఎస్‌ గుర్తింపు కార్డు 
1
1/3

పీఏసీఎస్‌ గుర్తింపు కార్డు

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement