సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో అనుకూల పవనాలతో అధికారం ‘హస్త’గతమైనప్పటికీ రాజధాని హైదరాబాద్ మాత్రం కాంగ్రెస్‌ను దూరం పెట్టింది. దశాబ్ద కాలంగా ఈ పార్టీకి ఇక్కడ ఆదరణ లభించడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడో ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవంగా పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో ఖాతా తెరవడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము కాగా, కోర్‌సిటీలో సైతం అదే పరిస్థితి నెలకొంది. దివంగత నేత వైఎస్‌ఆర్ హయాంలో మాత్రమే కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. గత మూడు పర్యాయాలుగా కనీసం ఖాతా తెరవని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఈసారి అధికారమే లక్ష్యంగా పావులు కదిపిన కాంగ్రెస్ అంతటా సత్తాచాటినా.. హైదరాబాద్ ఫలితాలు మాత్రం ఖంగుతినిపించాయి. పాతబస్తీతో పాటు కోర్‌సిటీ సెగ్మెంట్లలో గట్టిపోటీకి ప్రయత్నించినా..ఫలిత మాత్రం దక్కలేదు. అన్నింటిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
దశాబ్దకాలంగా..
దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ వరుస అపజ యాలతో పూర్తిగా పట్టు కోల్పోయింది. కనీసం సంస్థాగతంగా నాయకత్వం కూడా కరువైంది. హైదరాబాద్‌ను ఖైరతాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలుగా విభజించి సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నించినా సాధ్యంకాని పరిస్థితి నెలకొంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, మేనిఫెస్టో, డిక్లరేషన్‌లు సైతం నగరవాసులను ఆకర్షించలేకపోయాయి. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సర్వేలపై సర్వేలు నిర్వహించి పారాచ్యూట్‌లకు సైతం అవకాశం ఇచ్చినా..ఎన్నికల్లో బోల్తా పడక తప్పలేదు. పలు అసెంబ్లీ స్థానాల్లో మూడు, నాల్గవ స్థానాలకు పరిమితమైంది. వాస్తవంగా 2009లో వైఎస్ హయాంలో ముషీరాబాద్, ఖైరతాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, గోషామహల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ సెగ్మెంట్లు కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం అనంతరం పూర్తిగా చతికిలపడింది. 2014లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలనుసైతం దక్కించుకోలేక పోయింది. 2018 ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్‌తో కలిసి కూటమిగా పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అన్ని స్థానాల్లో అపజయాన్ని మూటగట్టుకుంది. పదేళ్లలో రెండు పర్యాయాలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగినా..అందులోనూ సైతం మొక్కుబడి స్థానాలకు పరిమితమైంది.
నాయకత్వ లోపం..
కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే. నగర అధ్యక్షుల ఎంపికలో ఆలస్యం..సీనియర్ల మధ్య సమన్వయలేమికాంగ్రెస్‌కు నష్టం చేకూర్చింది. 2014, 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ, 2020లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నా అధిష్టానం సమీక్షించుకోకపోవడం దారుణం. రాష్ట్ర పార్టీ సీనియర్లలో నెలకొన్న వివాదాలు కూడా నగరపార్టీపై తీవ్ర ప్రభావం చూపాయి.దీంతో నగర కాంగ్రెస్ ఆ నాథగా మారింది. దీని ప్రభావమే తాజా ఎన్నికల్లో నూ ఖాతా తెరవకుండా పోవడానికి దారితీసింది.
దశాబ్ద కాలంగా బోణీ కొట్టని కాంగ్రెస్
సిటీజనుల మనసు దోచని హస్తం నేతలు
వైఎస్ హయాంలోనే పార్టీ హవా
మూడు పర్యాయాలుగా ఖాతా తెరవని వైనం..