
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అధికార బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. నిన్న మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు.. ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ఒక్కసారిగా బహిర్గతమవుతుండటం ఆ పార్టీ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురి చేస్తోంది. కేడర్ మొత్తాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే నేత లేకపోవడం, పార్టీ జిల్లా అధ్యక్షుడు తన నియోజకవర్గం దాటి బయటికి రాకపోవడం, పార్టీలో ఒకరిపై మరొకరు అవినీతి, భూ కబ్జాలపై బహిరంగంగానే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండటం ఇబ్బందికరంగా మారింది. పార్టీ ముఖ్య నేతలే వర్గాలుగా విడిపోయి బహిరంగ విమర్శలకు దిగుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాలకే పరిమితమైన అంతర్గత విభేదాలు తాజాగా మహేశ్వరం, ఎల్బీనగర్‌కు విస్తరించాయి.
ఎల్బీనగర్ సాక్షిగా బహిర్గతం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొంతకాలంగా ఉన్న అంతర్గత విభేదాలు.. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ సమయంలో ఒక్కసారిగా తేటతెల్లమయ్యాయి. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ సహా పలువురు మాజీ కార్పొరేటర్లు ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆ తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పేరుతో ఆ పార్టీని వీడి.. బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతలు.. ఆ తర్వాతి నుంచి ఒకే పార్టీలో కొనసాగుతూ వస్తున్నా రు. నియోజకవర్గం అభివృద్ధి, సంస్థాగతంగా పార్టీ బలోపేతం వంటి అంశాల్లో ఎమ్మెల్యే నిర్ణయమే కీల కంగా మారడంతో ముద్దగోని సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇటీవల ఎమ్మెల్సీ కవిత (సీబీఐ విచారణ సమయంలో ఆమెకు మద్దతుగా)తో పాటు ఢిల్లీకి కూడా వెళ్లి వచ్చారు. తాజాగా శనివారం ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరయ్యారు. ఇదే సమయంలో చంపాపే ట్ మాజీ కార్పొరేటర్ రమణారెడ్డిపై ఎమ్మెల్యే వర్గీయులు దాడికి యత్నించడం, సదరు మాజీ కార్పొరేటర్, ముద్దగోనితో పాటు మరికొంతమంది మాజీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళం విప్పడంతో విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
మహేశ్వరంలో వరుస తిరుగుబాట్లు
మహేశ్వరం నియోజకవ్గంలోనూ అంతర్గత విభేధాలు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మంత్రి సబితకి వ్యతిరేకంగా గళం విప్పారు. బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదే సమయంలో బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత సైతం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి సైతం అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ఇంకా సమసిపోకముందే..తాజాగా పార్టీ సీనియర్ నేత కొత్త మనోహర్‌రెడ్డి తిరుగుబాటుబావుటాను ఎగరేశారు. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు పార్టీ కేడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నాయి.
చేవెళ్లలో రత్నం వర్సెస్ కాలె..
చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం మధ్య కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత ఎన్నికల్లో రత్నం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన కూడా అధికార బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ఇద్దరు అభ్యర్థులు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై బరిలోకి దిగాలని రత్నం భావిస్తుండగా..ఆయనకు ముందే చెక్ పెట్టాలని ఎమ్మెల్యే కాలె యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇరువురు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు అవినీతి, భూ కబ్జాలు, వంటి అంశాలపై బహిరంగంగా ఆరోపణలు చేసుకున్నారు. అధిష్టానం ఆదేశాలతో ప్రస్తుతం కొంత సైలెంట్‌గా ఉన్నారు.
కల్వకుర్తిలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ
కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. పార్టీలోని ద్వితీయ శ్రేణి కేడర్ రెండుగా చీలిపోయింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విషయంలో ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఒకరు ఎస్ అంటే..మరొకరు నో అంటున్నారు. కొన్ని చోట్ల పార్టీ గ్రామ శాఖలు కూడా రెండుగా చీలిపోయాయి. ఒకరు హాజరయ్యే కార్యక్రమాన్ని మరొకరు అడ్డుకుం టున్నారు. ఈ అంతర్గత పోరు ఎక్కడికి దారి తీస్తుందోనని స్థానికంగా చర్చనీయాంశమైంది.
అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు
మొన్న చేవెళ్ల, కల్వకుర్తి.. నిన్న మహేశ్వరం
తాజాగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో బహిర్గతం
ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో గళం విప్పుతున్న నేతలు
అయోమయంలో ద్వితీయశ్రేణి కేడర్